Weather Update: తెలుగు రాష్ట్రాలపై భానుడి పంజా.. 10 రోజుల పాటు నిప్పుల కొలిమిలా మారనున్న ఏపీ, తెలంగాణ
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఏపీ, తెలంగాణలో మరో 10 రోజుల పాటు 44 డిగ్రీలకు ఉష్ణోగ్రత పెరగనుంది.
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. ఏప్రిల్ నెలలోనే ఎండలు ముదురుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు శరవేగంగా పెరుగుతున్నాయి. రానున్న 10 రోజుల పాటు పరిస్థితి ఇంకా దారుణంగా ఉండబోతోందని, ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్కును దాటవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఎండల తీవ్రత మరింత పెరగనుంది. రానున్న 10 రోజుల పాటు, అంటే ఏప్రిల్ 22వ తేదీ వరకు రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారబోతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 40 డిగ్రీల మార్కు దాటిపోయింది. నల్గొండ జిల్లా ఘనపూర్‌లో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ నగరంలో కూడా 41 డిగ్రీల వరకు ఎండలు కాసే అవకాశం ఉండటంతో నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎడారి గాలుల ముప్పు
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎండల తీవ్రత భీకరంగా ఉంది. ముఖ్యంగా రాజస్థాన్‌లోని థార్ ఎడారి నుంచి వీచే వేడి గాలులు మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించి రాయలసీమ జిల్లాల్లోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయి. దీనివల్ల సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ప్రస్తుతం గ్రీన్‌హౌస్ ప్రభావం, స్థానిక మార్పుల వల్ల ఎండలు పెరుగుతుండగా, మే నెల ద్వితీయార్థంలో ఈ వేడి గాలుల ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులు
ఈ ఏడాది శక్తిమంతమైన ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని ఏపీయూ వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. ఒకవేళ దీని ప్రభావం పెరిగితే, సాధారణం కంటే ఎండలు ఎక్కువగా ఉండటమే కాకుండా రాబోయే వర్షాకాలంపై కూడా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నా, అవి చల్లదనాన్ని ఇవ్వకపోగా ఉక్కపోతను మరింత పెంచుతున్నాయి. ఏప్రిల్ నెలాఖరు నాటికి వాతావరణ పరిస్థితులపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
వైద్యుల సూచనలు
ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం ఉత్తమం. వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. దాహం వేయకపోయినా తరచుగా మంచినీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి. బయటికి వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించి, గొడుగు లేదా టోపీని తప్పనిసరిగా వాడాలని యంత్రాంగం సూచిస్తోంది.




