కాళేశ్వరం అనుమతులు రద్దు కుట్ర.. సీఎం రేవంత్ ఎందుకు మౌనం?: హరీశ్‌రావు ఫైర్!

Harish Rao: గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) సమావేశం అజెండాపై బీఆర్‌ఎస్ ముఖ్య నేత హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 5 Aug 2026 4:05 PM IST
కాళేశ్వరం అనుమతులు రద్దు కుట్ర.. సీఎం రేవంత్ ఎందుకు మౌనం?: హరీశ్‌రావు ఫైర్!
X

Harish Rao: తెలంగాణ సాగు, తాగునీటి ప్రయోజనాలను పణంగా పెట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని బీఆర్‌ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ నెల 18న జరగనున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) సమావేశం కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడేందుకే జరుగుతున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు.

తెలంగాణకు చెందిన కాళేశ్వరంతో సహా 7 కీలక ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని ఏపీ ప్రతిపాదించిందని, కాళేశ్వరం అనుమతులు రద్దు చేయడం అంటే సగం తెలంగాణకు నీటిని దూరం చేయడమేనని మండిపడ్డారు.

అజెండా ఖరారై వారం రోజులు గడుస్తున్నా తెలంగాణ ప్రభుత్వం నోరు విప్పకపోవడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి పరోక్ష అంగీకారం ఉందా అని ప్రశ్నించారు. జీఆర్‌ఎంబీలో ఉన్న రాష్ట్ర ఇంజనీర్లు దీనిని ఎందుకు అంగీకరించారని నిలదీశారు.

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు లేదా అని నిలదీశారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు రాష్ట్ర హక్కుల కోసం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఒక్క ప్రాజెక్టుకు కూడా కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడంలో తీవ్రంగా విఫలమైందని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story