Bhadradri Kothagudem : అంత్యక్రియల తర్వాత అసలు నిజం.. చితాభస్మంలో కత్తెర కలకలం.!

Bhadradri Kothagudem : వైద్యాన్ని దేవుడితో సమానంగా చూసే సమాజంలో, కొందరు సిబ్బంది బాధ్యతారాహిత్యం పచ్చని సంసారాల్లో తీరని నిప్పులు పోస్తోంది...

G Krishna
Published on: 19 Jun 2026 10:07 AM IST
Bhadradri Kothagudem
X

Bhadradri Kothagudem 

Bhadradri Kothagudem : వైద్యాన్ని దేవుడితో సమానంగా చూసే సమాజంలో, కొందరు సిబ్బంది బాధ్యతారాహిత్యం పచ్చని సంసారాల్లో తీరని నిప్పులు పోస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘోరమైన, మానవత్వాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసిన ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. విధి నిర్వహణలో వైద్యుల గైర్హాజరు, స్టాఫ్ నర్స్ నిర్లక్ష్యం.. ఒకేసారి ఇద్దరు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి.

డాక్టర్ లేరు.. నర్సే డాక్టరైంది..

ఈ నెల 13న వనజ అనే గర్భిణికి పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆశతో, నమ్మకంతో గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీరా అక్కడికి వెళ్తే, అత్యవసర సమయంలో పేషెంట్‌ను కాపాడాల్సిన కనీస బాధ్యత లేని వైద్యాధికారి అక్కడ అందుబాటులో లేరు. దాంతో అక్కడే ఉన్న ఒక స్టాఫ్ నర్సే తానే సర్వస్వమై కాన్పు చేయడానికి పూనుకుంది. ఆ నర్సు చేసిన ప్రయోగాల వల్ల వనజ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

నరకయాతన.. తల్లీబిడ్డల మృతి

కాన్పు అయిన కొద్దిసేపటికే వనజ పరిస్థితి అత్యంత విషమంగా మారింది. తప్పు జరిగిందని గ్రహించిన అక్కడి సిబ్బంది, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఆమెను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించమని చెప్పారు. అయితే, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. ఖమ్మం తరలిస్తుండగానే దారిలోనే వనజ ప్రాణాలు విడిచింది. ఆ తల్లి కంటే ముందే ఆ పసికందు కూడా కన్నుమూసింది. ఆసుపత్రి సిబ్బంది చేసిన నిర్వాకానికి పుట్టెడు దుఃఖంతో ఆ కుటుంబం తల్లీబిడ్డల అంత్యక్రియలను పూర్తి చేసింది.

చితాభస్మంలో తేలిన అసలు పాపం

అయితే, కథ ఇక్కడితో ముగిసిపోలేదు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత శ్మశానంలో చితాభస్మాన్ని (బూడిదను) సేకరిస్తున్న కుటుంబ సభ్యులకు అక్కడ కనిపించిన దృశ్యం చూసి గుండె ఆగినంత పనైంది. ఆ బూడిదలో డెలివరీ సమయంలో వాడే ఒక 'కత్తెర' (Scissors) లభ్యమైంది. కాన్పు చేసేటప్పుడు ఆ స్టాఫ్ నర్స్ ఎంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించిందో చెప్పడానికి ఈ కత్తెరే సజీవ సాక్ష్యంగా నిలిచింది. కడుపు కోసి లోపల కత్తెర మరిచిపోవడం వల్లే ఇన్ఫెక్షన్ అయి, రక్తం గడ్డకట్టి ఆ తల్లీబిడ్డలు చనిపోయారని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సస్పెన్షన్ వేటు.. సరిపోతుందా..?

ఈ ఘోరంపై బాధితులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి, విధుల్లో నిర్లక్ష్యం వహించిన గుండాల వైద్యాధికారిని (Medical Officer) సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇక్కడ ప్రజల నుంచి వస్తున్న సూటి ప్రశ్న ఒక్కటే.. కేవలం ఒక సస్పెన్షన్ వేటు వేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? నిరుపేదలు వెళ్లే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ప్రాణాల చెలగాటం ఇంకెన్నాళ్లు సాగుతుంది? కడుపులో కత్తెర పెట్టి కుట్టేసిన ఆ స్టాఫ్ నర్స్‌పై, సమయానికి విధుల్లో లేని డాక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story