Medak: అమ్మమ్మను చంపి గుండెపోటుగా నమ్మించిన మనవడు.. రామాయంపేట కేసులో షాకింగ్ నిజాలు!
Medak: మెదక్ జిల్లా రామాయంపేటలో ఈ నెల 18న జరిగిన వృద్ధురాలు సాయమ్మ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు.
Medak: అమ్మమ్మను చంపి గుండెపోటుగా నమ్మించిన మనవడు.. రామాయంపేట కేసులో షాకింగ్ నిజాలు!
Medak: మెదక్ జిల్లా రామాయంపేటలో ఈ నెల 18వ తేదీన జరిగిన వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. పైకి గుండెపోటు మరణంగా కనిపించిన ఈ ఘటన వెనుక.. జల్సాల కోసం అమ్మమ్మనే హతమార్చిన మనవడి క్రూరత్వం దాగి ఉందని పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాయంపేటకు చెందిన సాయమ్మ (65) అనే వృద్ధురాలు ఈ నెల 18న తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. అయితే, ఆమె గుండెపోటుతోనే చనిపోయిందని మనవడు విశాల్ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, మృతురాలి కొడుకు శ్యామ్‌కు తన తల్లి మృతిపై తీవ్రమైన అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించాడు. కొడుకు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు ఘోరం వెలుగుచూసింది.
పోలీసుల విచారణలో నిందితుడు విశాల్ చెప్పిన నిజాలు విని అధికారులు సైతం అవాక్కయ్యారు. విశాల్‌కు కొత్త బైక్ కొనాలనే కోరిక బలంగా ఉండేది. అందుకోసం డబ్బులు లేకపోవడంతో, అమ్మమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై కన్నేశాడు. నగలు ఇవ్వాలని అమ్మమ్మను అడగగా ఆమె నిరాకరించింది. ఎలాగైనా ఆ నగలను కాజేయాలనుకున్న విశాల్ ఒక కంత్రి ప్లాన్ వేశాడు. బయట మెడికల్ షాప్‌కు వెళ్లి కొన్ని నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. అమ్మమ్మ రోజూ తాగే కల్లులో ఆ నిద్రమాత్రలను కలిపి ఆమెకు ఇచ్చాడు.
మాత్రల ప్రభావంతో సాయమ్మ స్పృహ కోల్పోయిన తర్వాత.. విశాల్ తన స్నేహితుడు ప్రశాంత్‌ను ఇంటికి పిలిపించుకున్నాడు. ఇద్దరూ కలిసి వృద్ధురాలి ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి దారుణంగా హతమార్చారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దొంగిలించి.. ఏమీ తెలియనట్లు గుండెపోటుతో చనిపోయిందని డ్రామా ఆడారు.
తన తల్లి మరణం వెనుక ఏదో కుట్ర ఉందన్న కొడుకు శ్యామ్ (నిందితుడి తండ్రి) అనుమానమే ఈ కేసులో కీలకంగా మారింది. పోలీసులు నిందితుడు విశాల్‌ను అదుపులోకి తీసుకుని గట్టిగా నిలదీసేసరికి, తానే తన స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి అమ్మమ్మను చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. క్షణికావేశం, బైక్‌లు, జల్సాల కోసం కన్నవారిని, రక్తసంబంధాలనే పొట్టనబెట్టుకుంటున్న నేటి యువత తీరుపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం, విచారం వ్యక్తమవుతోంది.




