గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్.. అజారుద్దీన్, కోదండరామ్ పేర్లకు గవర్నర్ ఆమోదముద్ర!
Telangana Governor Quota MLC: తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరామ్ అభ్యర్థిత్వాలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. దీంతో మంత్రి అజారుద్దీన్ పదవికి ముప్పు తప్పింది. త్వరలోనే అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్.. అజారుద్దీన్, కోదండరామ్ పేర్లకు గవర్నర్ ఆమోదముద్ర!
Telangana Governor Quota MLC: తెలంగాణ రాజకీయాల్లో గత మూడేళ్లుగా సస్పెన్స్‌గా మారిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించిన మహ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరామ్ అభ్యర్థిత్వాలను ఆమోదిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతకం చేశారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది.
ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్‌కు ఈ నియామకం అత్యంత కీలకం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన ఈ నెల 30 లోగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయకపోతే మంత్రి పదవిని కోల్పోయే ప్రమాదం ఉండేది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల గవర్నర్‌ను కలిసి అభ్యర్థిత్వాలను త్వరగా ఆమోదించాలని కోరారు. గవర్నర్ నిర్ణయంతో అజారుద్దీన్ మంత్రి పదవికి ఉన్న గండం గట్టెక్కినట్లయింది.
2025 ఆగస్టు 13న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 30న వీరిద్దరి పేర్లను గవర్నర్ కార్యాలయానికి పంపింది. అయితే, కొత్త గవర్నర్ బాధ్యతలు చేపట్టిన తరుణంలో ఈ ప్రక్రియపై నిర్ణయం తీసుకోవడానికి సమయం పట్టింది. తాజాగా అటార్నీ జనరల్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేయగా, ఈలోపే గవర్నర్ అభ్యర్థిత్వాలపై సానుకూల నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఈ నియామకాలతో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అటు అభ్యర్థులకు పెద్ద ఉపశమనం లభించింది. ప్రజా సంఘాల నేతగా గుర్తింపు పొందిన కోదండరామ్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఇప్పుడు శాసన మండలిలో అడుగుపెట్టబోతున్నారు.




