Raja Singh: అన్నామలై రాజీనామాపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Raja Singh: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై రాజీనామాపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Raja Singh: అన్నామలై రాజీనామాపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Raja Singh: తమిళనాడు బీజేపీలో (Tamil Nadu BJP) అత్యంత కీలక నేతగా ఎదిగి, ఇటీవలే ఆ పార్టీకి, తన రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలుకుతూ రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై (Annamalai) వ్యవహారంపై హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా అన్నామలై రాజీనామాను పార్టీ అధిష్ఠానం ఆమోదించిన తీరుపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
తమిళనాడు లాంటి ప్రాంతంలో బీజేపీకి ఒక ప్రత్యేక గుర్తింపు, జనాదరణ తెచ్చిన అన్నామలై వంటి బలమైన నేత పార్టీని వీడటం అత్యంత దురదృష్టకరమని రాజాసింగ్ పేర్కొన్నారు. అన్నామలై ఆరేళ్ల క్రితం తన ప్రతిష్టాత్మక ఐపీఎస్ (IPS) ఉద్యోగానికి రాజీనామా చేసి దేశం కోసం, సిద్ధాంతం కోసం బీజేపీలో చేరారని రాజాసింగ్ గుర్తు చేశారు. తమిళనాడులో కమలం పార్టీకి క్షేత్రస్థాయిలో ఊపు తెచ్చింది అన్నామల్యేనని, అలాంటి నాయకులు పార్టీని వీడితే సంస్థకే భారీ నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏదైనా ఒక వ్యక్తి లేదా కీలక నేత పార్టీకి రాజీనామా ఇస్తే.. దానికి గల కారణాలు ఏంటో అధిష్ఠానం తెలుసుకోవాలని, వారిని పిలిచి మాట్లాడాల్సిన కనీస బాధ్యత పెద్దలపై ఉందని హితవు పలికారు. అన్నామలై ఉదంతాన్ని ప్రస్తావిస్తూ గతంలో తనకు ఎదురైన రాజకీయ పరిణామాలను, చేదు అనుభవాలను రాజాసింగ్ బహిరంగంగా పంచుకున్నారు.
"గతంలో నా విషయంలో ఏమైతే జరిగిందో.. ఇప్పుడు అన్నామలై విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలను, ఇక్కడి విషయాలను కేంద్ర పెద్దలకు వివరించాలని నేను ఎంతో ప్రయత్నించాను. ఢిల్లీలో పెద్ద నాయకులను కలవడానికి ప్రయత్నం చేసినా ఎవ్వరూ నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు, నన్ను కలవలేదు. దాంతో విసిగిపోయి చివరకి పార్టీకి రాజీనామా ఇచ్చాను." అని అన్నారు.
తాను రాజీనామా లేఖ ఇచ్చినప్పుడు.. కనీసం ఎందుకు రాజీనామా ఇస్తున్నావో అని ఒక్క మాట కూడా అడగకుండా, తక్షణమే ఆమోదించేశారని రాజాసింగ్ గుర్తు చేసుకున్నారు. తాను బీజేపీ నుంచి బయటకు వచ్చి ఏడాది అవుతున్నా, ఇప్పటివరకు ఏ ఇతర పార్టీలోకి వెళ్లలేదని, భవిష్యత్తులో వెళ్లే ప్రసక్తే లేదని తన నిబద్ధతను చాటుకున్నారు. నాలాంటి, అన్నామలై లాంటి కట్టా నిబద్ధత గల నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపైనే ఉందని, ఇలాంటి వాళ్లు బాధపడితే రాష్ట్ర, కేంద్ర నాయకులు తక్షణమే పిలిచి మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.




