Good News : తెలంగాణ రైతులకు బంపర్ ఆఫర్.. వారం రోజుల్లోనే అకౌంట్లలోకి పైసలు
Good News : తెలంగాణ రైతులకు శుభవార్త. వారం రోజుల్లోనే ధాన్యం డబ్బులు జమ చేయనుంది ప్రభుత్వం. సన్న వడ్లకు రూ.500 బోనస్, ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ రాబోతుంది.
Paddy Procurement Bonus
Good News : తెలంగాణ అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులు చిందించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ధాన్యం కొనుగోళ్ల నుంచి భూమి రికార్డుల వరకు రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా ధాన్యం అమ్మిన రైతులు పైసల కోసం ఎదురుచూడకుండా వారం రోజుల్లోనే నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలాగా ధాన్యం డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదని, ధాన్యం అమ్మిన ఏడు రోజుల్లోనే నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని ప్రకటించారు. దీనితో పాటు, సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాకు రూ.500 అదనపు బోనస్ కూడా వెంటనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పేదలకు అందిస్తామని, తద్వారా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
ధరణి స్థానంలో భూభారతి
గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల రైతులు ఎన్నో తిప్పలు పడ్డారని, చాలామంది తమ భూములను కోల్పోయారని మంత్రి విమర్శించారు. ధరణిలోని లోపాలను సరిదిద్దుతూ, మరింత పారదర్శకమైన భూభారతి పోర్టల్‌ను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త పోర్టల్ ద్వారా భూ రికార్డుల్లో అవకతవకలకు తావుండదని, రైతులకు తమ భూమిపై పూర్తి భద్రత ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.80 లక్షల మంది రైతులకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు అందజేసినట్లు ఆయన గుర్తు చేశారు.
రైతు భరోసా, సంక్షేమం
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.12 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే తొలి విడత సాయం రైతుల ఖాతాల్లో చేరిందని, అర్హులైన మిగిలిన రైతులందరికీ ఈ నెలాఖరులోగా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలను తాము పట్టించుకోమని, పేదల సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది కావాలనే ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని, కానీ ప్రభుత్వం అవేవీ ఖాతరు చేయకుండా అభివృద్ధి బాటలో ముందుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అన్నదాతలకు భరోసా
రైతుల సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో అధికారులు పని చేస్తున్నారని, ఎక్కడా అవినీతికి తావులేకుండా కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయని మంత్రి వివరించారు. భూ వివాదాలను పరిష్కరించడం కోసం భూభారతి పోర్టల్ ఒక వరంలా మారుతుందని, భూమి రికార్డుల నమోదులో రైతులే రాజులని పొంగులేటి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉండటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన ఉద్ఘాటించారు.




