గోదావరి పుష్కరాల ముందస్తు ప్లాన్.. ఘాట్ల అభివృద్ధికి ప్రణాళికలు!
Godavari Pushkaralu: 2027 గోదావరి పుష్కరాల నిర్వహణపై తెలంగాణ దేవాదాయ శాఖ ముందస్తు కసరత్తు ప్రారంభించింది.
గోదావరి పుష్కరాల ముందస్తు ప్లాన్.. ఘాట్ల అభివృద్ధికి ప్రణాళికలు!
Godavari Pushkaralu: 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించేందుకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ సమగ్ర చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుండి దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి గోదావరి పరివాహక జిల్లాల కలెక్టర్లతో గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ, పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా స్నాన ఘాట్ల అభివృద్ధి, రహదారి సదుపాయాలు, పార్కింగ్ ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్నాన ఘాట్ల వద్ద అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలో చేపట్టాల్సిన పనుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని పుష్కరాలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. అందిన ప్రతిపాదనల మేరకు ప్రాధాన్యత పనులకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి ఇరిగేషన్, ఆర్ & బి, పంచాయతీరాజ్, దేవాదాయ శాఖల ద్వారా చేపట్టనున్న పనులను వివరించారు. ఘాట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల విస్తరణ, నూతన రహదారుల నిర్మాణం తదితర పనులకు సంబంధించి ఆయా శాఖల ద్వారా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపినట్లు తెలిపారు. అదనంగా అవసరమైన రహదారులు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు .
ఈ వీడియో కాన్ఫరెన్స్లో భద్రాచలం దేవస్థానం ఈవో దామోదర్ రావు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




