Gaddam Prasad: స్పీకర్‌గా ఇవే చివరి సమావేశాలు..గడ్డం ప్రసాద్‌కు మంత్రిగా ప్రమోషన్..?

Gaddam Prasad: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కి రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి దక్కనుందా.?

Gagan kumar
Published on: 12 Sept 2026 11:20 AM IST
Gaddam Prasad
X

Gaddam Prasad: స్పీకర్‌గా ఇవే చివరి సమావేశాలు..గడ్డం ప్రసాద్‌కు మంత్రిగా ప్రమోషన్..?

Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర చర్చ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయంలో తీవ్ర సంచలనంగా మారింది. స్పీకర్ స్థానంలో ఆయనకు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలని, రాబోయే సెషన్ నాటికి ఆయన మంత్రి హోదాలో ట్రెజరీ బెంచ్‌లో కూర్చోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా తనకు కేబినెట్‌లో చోటు దక్కడం ఖాయమనే ధీమాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉన్నారు.

ఈ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి రెండు, మూడు రోజుల ముందే ఆయన ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఈ భేటీలో మంత్రి పదవిపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆయనకు స్పష్టమైన హామీ లభించినట్లు తెలుస్తోంది. ప్రసాద్ కుమార్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహం కూడా పుష్కలంగా ఉందనేది ఆ పార్టీ వర్గాల సమాచారం. రేవంత్ సూచనల మేరకే ఆయన ఢిల్లీ పెద్దలను కలిసినట్లు చెప్తున్నారు.

ప్రస్తుత రేవంత్ కేబినెట్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. ప్రసాద్ కుమార్‌కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వలేదనే విమర్శలకు చెక్ పెట్టవచ్చని సీఎం రేవంత్ భావిస్తున్నారు. అదే జిల్లా నుంచి రేసులో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇతర ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ లేదా ఇతర కీలక పదవులు ఇవ్వాలని యోచిస్తున్నారు.

సమావేశాల తొలిరోజే ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పీకర్ తీవ్రంగా మనస్తాపం చెందారు. సభ వాయిదా పడిన అనంతరం తన చాంబర్‌లో ఒంటరిగా కూర్చున్న ఆయనను పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరామర్శించారు. మీరు ధీమాగా ఉండండి. మీకు మద్దతుగా మేమంతా ఉన్నాం. ఈ విషయాన్ని సీఎం చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ సెషన్స్ వరకే ఈ ఇబ్బందులు వచ్చే సెషన్‌ నాటికి మీరు తప్పకుండా మంత్రి అవుతారు అంటూ ఎమ్మెల్యేలు ఆయనకు ధైర్యాన్ని నూరిపోశారు.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న సీనియర్ నాయకుడు అడ్లూరి లక్ష్మణ్‌ను తదుపరి స్పీకర్‌గా నియమించే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పొలిటికల్ ఈక్వేషన్లను మారుస్తూ జరగబోయే ఈ కేబినెట్ ప్రక్షాళన తెలంగాణ రాజకీయంలో సరికొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.