Health Camp: చెమట చుక్కకు ఆరోగ్య రక్ష.. ఇటుక బట్టీల్లో వైద్య పరీక్షలు

Health Camp: వెలిచాల ఇటుక బట్టీ కార్మికుల కోసం కరీంనగర్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 April 2026 3:26 PM IST
Health Camp
X

Health Camp: చెమట చుక్కకు ఆరోగ్య రక్ష.. ఇటుక బట్టీల్లో వైద్య పరీక్షలు

Health Camp: ​ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో వెలిచాలలోని ఇటుక బట్టీల వద్ద ఉచిత వైద్య శిబిరంతో పాటు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే. రాణి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని సంస్థ సభ్యులు, న్యాయవాదులు పెరుక రంగయ్య పటేల్, ఏ. కిరణ్ కుమార్, చిట్టి చంద్ర ప్రకాష్ రెడ్డి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కే. ప్రసాద్, లేబర్ ఆఫీసర్ మొహమ్మద్ రఫీ మరియు వెలిచాల గ్రామ సర్పంచ్ వీర్ల నర్సింగ రావు, న్యాయవాది బండపల్లి శ్రీధర్ లు ప్రారంభించారు. ​

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికంలో ఉండి ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన ఇటుక బట్టీ కార్మికులకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ శిబిరంలో ఎముకల వ్యాధి నిపుణులు, శిశువైద్యులు, కంటి వైద్యులు మరియు మానసిక వైద్య నిపుణులు వందలాది మంది కార్మికులకు క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య శిబిరంలో ఉచితంగా మందులు పంపిణీ చేయడమే కాకుండా కార్మికుల మానసిక ఒత్తిడిని తగ్గించడానికి సైకాలజిస్టుల ద్వారా ప్రత్యేక కౌన్సెలింగ్ అందించారు. ​

వైద్య పరీక్షలతో పాటు కార్మికులకు ఉండాల్సిన చట్టపరమైన హక్కులు, కనీస వేతనాలు మరియు భద్రతా నియమాలపై న్యాయ నిపుణులు అవగాహన కల్పించారు. ఏదైనా కష్టం వస్తే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులు భరత్ రాజ్, హారిక,వినీత్,మాధురి, మొహమ్మద్ హరీస్, ఫార్మసీ ఆఫీసర్ ప్రసాద్, నర్సింగ్ ఆఫీసర్ లు శ్రావణ్ కుమార్, ఉదయ్ కిరణ్, వెలిచాల మెడికల్ ఆఫీసర్ అశ్విత మరియు సిబిఆర్ ఇటుక బట్టీ యజమాని చిన్నకేశవులు, ఇటుక బట్టీ యజమానులు నారాయణ రావు, సురేందర్, అక్బర్, నవీన్ కార్మికులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story