Peddi Sudarshan Reddy : నర్సంపేటలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
Peddi Sudarshan Reddy : బిఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (52) గుండెపోటుతో యశోద ఆస్పత్రిలో కన్నుమూశారు.
Peddi Sudarshan Reddy
Peddi Sudarshan Reddy : తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత చురుగ్గా పాల్గొని, నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా సేవలందించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (52) కన్నుమూశారు. జులై 31 అర్ధరాత్రి 12:51 గంటలకు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యాధికారులు అధికారికంగా ధృవీకరించారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను రక్షించేందుకు వైద్యులు చేసిన సుదీర్ఘ ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన మరణంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం అలముకుంది.
అసలు ఏం జరిగింది?
ఈ నెల 26న ఉదయం హనుమకొండలోని తన నివాసంలో ఉన్న సమయంలో సుదర్శన్ రెడ్డికి ఒక్కసారిగా తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను స్థానిక రోహిణి ఆస్పత్రికి తరలించారు. అక్కడ పల్మనరీ ఎంబోలిజం కారణంగా గుండె ఆగిపోవడంతో వైద్యులు దాదాపు గంటపాటు శ్రమించి 9 సార్లు సీపీఆర్ చేసి ఆయన గుండె స్పందించేలా చేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అత్యవసరంగా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ, మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఆయన పరిస్థితి విషమించి కన్నుమూశారు.
సామాన్య రైతు బిడ్డ నుంచి చట్టసభల వరకు..
1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో సుదర్శన్ రెడ్డి జన్మించారు. ఆయన తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రారంభించారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుత బీఆర్ఎస్) ఏర్పడిన సమయంలో కేసీఆర్ పిలుపు మేరకు పార్టీలో చేరి, అదే ఏడాది నల్లబెల్లి జెడ్పీటీసీ సభ్యుడిగా ఘనవిజయం సాధించారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ వెంటే ఉంటూ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు.
నేడే స్వగ్రామం నల్లబెల్లిలో అంత్యక్రియలు
సుదర్శన్ రెడ్డి పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం 7 గంటలకు ఆస్పత్రి నుంచి ఆయన భౌతికకాయాన్ని నర్సంపేటకు తరలించారు. హనుమకొండలోని అమరవీరుల స్తూపం వద్ద కార్యకర్తలు, అభిమానుల నివాళుల అనంతరం నర్సంపేట మీదుగా ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి తీసుకెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నల్లబెల్లి గ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడిస్తూ, అంతిమయాత్ర ప్రశాంతంగా జరిగేలా పార్టీ శ్రేణులు, ప్రజలు సహకరించాలని కోరారు.




