Egg Prices: కొండెెక్కిన కోడిగుడ్డు ధర.. త్వరలోనే రూ.10 కి చేరే ఛాన్స్?

Egg Prices: సామాన్యుడి వంటింట్లో మళ్లీ ధరల మంటలు భగ్గుమన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోయాయి.

Arun Chilukuri
Published on: 2 July 2026 12:29 PM IST
Egg Prices
X

Egg Prices: కొండెెక్కిన కోడిగుడ్డు ధర.. త్వరలోనే రూ.10 కి చేరే ఛాన్స్?

Egg Prices: సామాన్యుడి వంటింట్లో మళ్లీ ధరల మంటలు భగ్గుమన్నాయి. ఇప్పటికే కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. ఇప్పుడు పేదవాడి పౌష్టికాహారమైన కోడిగుడ్డు కూడా సామాన్యుడికి గండంలా మారుతోంది. మొన్నటి వరకు బడ్జెట్‌లో దొరికిన గుడ్డు ఇప్పుడు రెక్కలొచ్చినట్లు పైపైకి దూసుకుపోతోంది. మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర దాదాపు ఎనిమిది రూపాయలకు చేరి సంచలనం సృష్టిస్తోంది.

పేద, మధ్యతరగతి ప్రజలకు చౌకగా లభించే ఏకైక ప్రోటీన్ ఫుడ్ కోడిగుడ్డు.. కానీ ఇప్పుడు ఆ గుడ్డు కొనాలంటేనే జనం జంకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని వారాలుగా గుడ్డు ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ ప్రకారం హోల్‌సేల్ ధర ఆరు రూపాయల నలభై పైసల వరకు పలుకుతుండగా.. రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి ఒక్కో గుడ్డు ఏడు నుంచి ఎనిమిది రూపాయల వరకు విక్రయిస్తున్నారు.

ఒకసారి మార్కెట్ ధరల వివరాలు చూస్తే ఒక గుడ్డు హోల్‌సేల్ ధర ఆరు రూపాయల నుంచి ఆరు రూపాయల నలభై పైసలు పలుకుతుండగా..​ ఒక ట్రే ధర 185 నుంచి 192 రూపాయలు వరకు ఉంది. ఇక​రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర 7 నుంచి 8 రూపాయలు పలుకుతుంది. కొన్ని ప్రాంతాల్లో నాణ్యతను బట్టి ఇది ఎనిమిది రూపాయలు దాటిపోవడంతో, రానున్న రోజుల్లో సింగిల్ డిజిట్ దాటి పది రూపాయలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాపారులు చెబుతున్నారు.

ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడమే. ఈ ఏడాది వేసవిలో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల వల్ల కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఎండల తీవ్రత తట్టుకోలేక దాదాపు 10 శాతం మేర లేయర్ కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీనికి తోడు కోళ్ల దాణా అయిన సోయాబీన్, మొక్కజొన్న ధరలు పెరగడంతో నిర్వహణ ఖర్చులు భరించలేక పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. ప్రస్తుతం పాఠశాలలు, హాస్టళ్లు పునప్రారంభం కావడంతో గుడ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఉత్పత్తి తక్కువగా ఉండటం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు కొండెక్కాయి.

కూరగాయల ధరల భారం ఒకవైపు, కోడిగుడ్డు ధరల భారం మరోవైపు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. దీంతో సామాన్యులు గుడ్లు కొనలేక ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన ధరతో హోటళ్ల నిర్వాహకులు, బేకరీల యజమానులు ఆందోళన చెందుతున్నారు. మరి రానున్న రోజుల్లో గుడ్ల ధరలు తగ్గుతాయా లేదా అనేది చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story