ED Summons: ఐఏఎస్ అమోయ్ కుమార్‌కు ఈడీ సమన్లు
ED Summons: భూదాన్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌కు ఈడీ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. మే 25న కీలక ఆధారాలతో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
ED Summons: ఐఏఎస్ అమోయ్ కుమార్‌కు ఈడీ సమన్లు
ED Summons: తెలంగాణలో భూదాన్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ (FIR) ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే ఈ నెల (మే) 25న హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆయనను ఆదేశించారు.
అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో.. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని దాదాపు 42 ఎకరాల విలువైన భూదాన్ భూములను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. ధరణి రికార్డుల్లో మార్పులు చేయడం, 22A జాబితాలోని నిషేధిత భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున నిధులు చేతులు మారాయని విజిలెన్స్ విచారణలో తేలింది. ఈ భూదందా ద్వారా అమోయ్ కుమార్ భారీగా లబ్ధి పొందినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఇప్పటికే 2024 అక్టోబర్‌లో అమోయ్ కుమార్‌ను పలుమార్లు సుదీర్ఘంగా విచారించి వాంగ్మూలం నమోదు చేసింది. అయితే, తాజాగా జారీ చేసిన సమన్లలో ఈసారి మరింత దూకుడు పెంచినట్లు తెలుస్తోంది.
వివాదాస్పద భూమికి సంబంధించిన మూడు కీలక సేల్ డీడ్స్ (Sale Deeds - 1209, 1212, 4594) ఒరిజినల్ పత్రాలను వెంట తీసుకురావాలని ఆదేశించారు. అమోయ్ కుమార్‌కు సంబంధించిన పూర్తి బ్యాంక్ ఖాతాల వివరాలు, ఆస్తుల డిక్లరేషన్ పత్రాలను కూడా సమర్పించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
నాగారంలోని సర్వే నంబర్ 181, 182 పరిధిలోని వివాదాస్పద భూమిని ఖాదరున్నీసా అనే మహిళ పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు అప్పటి అధికారులతో కలిసి ఆయన సహకరించినట్లు ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో, మే 25న జరిగే విచారణ తర్వాత ఈడీ ఆయనపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.




