Karimnagar: యువత భవిష్యత్తుతో చెలగాటం వద్దు.. సర్కార్‌పై DYFI యుద్ధం!
Karimnagar: కరీంనగర్లో DYFI నాయకుల ముందస్తు అరెస్టులు. చలో అసెంబ్లీ ముట్టడిని అడ్డుకోవడంపై నరేష్ పటేల్ ఆగ్రహం.
Karimnagar: యువత భవిష్యత్తుతో చెలగాటం వద్దు.. సర్కార్‌పై DYFI యుద్ధం!
కరీంనగర్: భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI)రాష్ట్ర కమిటీ పిలుపుతో యువత హక్కుల కోసం నిర్వహిస్తున్న చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ నిర్బంధ పాలన కొనసాగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
జిల్లా వ్యాప్తంగా DYFI నాయకులను ఉదయం నుండి ముందస్తుగా అరెస్టు చేయడం, ఇళ్ల వద్దనే నిర్బంధించడం, ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య హక్కులపై బహిరంగ దాడన్నారు. . జిల్లా అధ్యక్షుడు సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ పటేల్, ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్, సహాయ కార్యదర్శి అరవింద్, నాయకులు అజేయ్లతో పాటు అనేక మందిని అక్రమంగా అరెస్ట్ చేసి కరీంనగర్ 2వ పోలీస్ స్టేషన్‌కు తరలించడం ప్రభుత్వం దౌర్జన్యానికి నిదర్శనం అన్నారు.
ఈ సందర్భంగా DYFI జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ పటేల్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తీవ్రంగా మండిపడ్డారు.
యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం చరిత్రలోనే అతిపెద్ద ద్రోహమన్నారు.2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వం యువత భవిష్యత్తును చీకట్లో నెట్టిందన్నారు. రాష్ట్రంలో లక్షలాది ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకపోవడం నిరుద్యోగ యువతపై దారుణ అన్యాయం అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అమలు చేయకపోవడం స్పష్టమైన మోసం అని విమర్శించారు. రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేయకుండా కాలయాపన చేయడం యువతను తీవ్ర నిరాశలోకి నెడుతోందన్నారు.
యువత సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు, నిర్బంధాలు, కేసులు పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని బయటపెడుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా DYFI నాయకులను ఇళ్ల వద్దనే నిర్బంధించడం ప్రభుత్వం భయపడుతున్న సంకేతమన్నారు. యువత ఉద్యమాన్ని అణచివేయాలని చేసే ప్రతి ప్రయత్నం తిరుగుబాటుకు దారితీస్తుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి హామీని తక్షణమే అమలు చేయాలని, క్రీడ రంగానికి అధిక నిధులు కేటాయించి యువతకు ప్రోత్సాహం కల్పించాలని, రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, నూతన పరిశ్రమలు నెలకొల్పి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు సృష్టించాలని డిమాండ్ చేశారు.యువత హక్కుల కోసం జరుగుతున్న పోరాటాన్ని అణచివేయాలని ప్రభుత్వం చేసే ప్రతి ప్రయత్నాన్ని DYFI తీవ్రంగా ప్రతిఘటిస్తుందని, అరెస్టులు, నిర్బంధాలు ఉద్యమాన్ని ఆపలేవని, యువత సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.




