Weather Update : తెలుగు రాష్ట్రాలకు తుపాన్ గండం.. వచ్చే 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు

Weather Update : ఏపీ, తెలంగాణలో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రంలో రెండు తుపాన్లు ఉండటంతో గాలుల వేగం పెరిగి పిడుగులు పడే ప్రమాదం ఉంది.

CR Reddy
Published on: 6 April 2026 6:44 AM IST
Weather Update
X

Weather Update 

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్న వేళ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా సముద్రాల్లో ఏర్పడిన తుపాన్లు మన వాతావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

కోస్తాంధ్రలో భారీ వర్షాలు.. రాయలసీమలో ఎండలు

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం అత్యంత వింతగా మారుతోంది. ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర వరకు సోమవారం (ఏప్రిల్ 6) మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో మేఘాలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి. పిడుగులు పడే ముప్పు ఎక్కువగా ఉన్నందున ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అయితే, రాయలసీమలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి ఉంది. అక్కడ ఎండలు భగ్గుమంటున్నాయి. ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరే అవకాశం ఉన్నందున వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణలో వింత వాతావరణం

తెలంగాణలో నేడు మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై జల్లులు పడే అవకాశం ఉంది. సాయంత్రం వేళ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉంది. కానీ, హైదరాబాద్ సహా మధ్య, దక్షిణ తెలంగాణలో ఉక్కపోత విపరీతంగా ఉంటుంది. ఇక్కడ ఎండ తీవ్రత 38 డిగ్రీల వరకు ఉండొచ్చు. వర్షం కురిసే సమయంలో గంటకు 26 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, బైక్ ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం తెలిపింది.

సముద్రంలో రెండు తుపాన్లు

ప్రస్తుతం సముద్రాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా వైపున మైలా, వలను అనే రెండు శక్తివంతమైన తుపాన్లు కేంద్రీకృతమై ఉన్నాయి. వీటి గాలుల వేగం గంటకు 155 కిలోమీటర్ల వరకు ఉంది. వీటికి తోడు హిందూ మహాసముద్రంలో ఉన్న ఇందుసా వాయుగుండం కూడా మన వాతావరణాన్ని ప్రభావితం చేస్తోంది. భూమధ్య రేఖ దగ్గర మేఘాల సాంద్రత పెరగడం వల్ల ఈ ఏప్రిల్ నెల మొత్తం తీవ్రమైన ఎండలు, అదే స్థాయిలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. భూతాపం వల్లే ఇలాంటి విపరీత మార్పులు వస్తున్నాయని, మే నెలకు ముందే వాతావరణం ఇంత అల్లకల్లోలంగా మారడం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

CR Reddy

CR Reddy

Next Story