Electric Shock: కరెంటు షాక్‌తో మరణిస్తే రూ.8 లక్షల పరిహారం

Electric Shock: విద్యుత్ ప్రమాద మరణాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.8 లక్షలకు పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి (ERC) సంచలన నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 2 April 2026 10:31 AM IST
Electric Shock
X

 Electric Shock: కరెంటు షాక్‌తో మరణిస్తే రూ.8 లక్షల పరిహారం

Electric Shock: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఊరటనిస్తూ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త టారిఫ్ ఉత్తర్వులను వెల్లడిస్తూనే, పలు సేవా మెరుగుదల చర్యలను ప్రకటించింది.

ప్రమాద పరిహారం పెంపు

కరెంటు షాక్ తగిలి ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి ఇప్పటివరకు ఇస్తున్న రూ.5 లక్షల పరిహారాన్ని రూ.8 లక్షలకు పెంచాలని ఈఆర్‌సీ డిస్కంలను ఆదేశించింది. ఈ పెంపు ఈ నెల (ఏప్రిల్) 1వ తేదీ నుంచే అమల్లోకి రానుంది. ఒకవేళ వినియోగదారుల పొరపాటు వల్ల ప్రమాదం జరిగినా ఈ పరిహారం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రమాదం జరిగిన రెండు నెలల్లోగా పరిహారం చెల్లించని పక్షంలో, దానికి గల కారణాలను డిస్కంలు తప్పనిసరిగా వివరించాల్సి ఉంటుంది.

పాత చార్జీలే కొనసాగింపు - ట్రూఅప్ నిలిపివేత

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కరెంటు చార్జీలను పెంచడం లేదని, పాత చార్జీలే వర్తిస్తాయని ఈఆర్‌సీ స్పష్టం చేసింది. 2022-24 మధ్య పెరిగిన రూ.7,635 కోట్ల అదనపు వ్యయం (ట్రూఅప్ చార్జీలు) వసూలుకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపినప్పటికీ, ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయవద్దని ప్రభుత్వం సూచించడంతో, 'రైతు డిస్కం' ప్రక్రియ ముగిసే వరకు ఈ నిర్ణయాన్ని వాయిదా వేశారు.

రీఫండ్‌కు ఆదేశం.. ఎవరికంటే?

హెచ్‌టీ వినియోగదారులు: అనుమతించిన లోడు కంటే అదనంగా వాడినందుకు వసూలు చేసిన పెనాల్టీలను, అవగాహన కల్పించకుండా వసూలు చేసినందున మొదటి రెండు నెలల మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.

సోలార్ వినియోగదారులు: రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లు ఉండి, అదనపు యూనిట్ల వాడకంపై అధిక శ్లాబుల రేట్లు వసూలు చేసిన సొమ్మును రాబోయే 3 నెలల బిల్లుల్లో సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది.

లోటు భర్తీకి ప్రభుత్వ హామీ

డిస్కంల ఆదాయ వ్యయాల మధ్య ఉన్న రూ.15,105.91 కోట్ల లోటులో, రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేల కోట్లను సబ్సిడీ రూపంలో ఇవ్వడానికి అంగీకరించింది. మిగిలిన మొత్తాన్ని రెగ్యులేటరీ ఎసెట్‌గా పరిగణించనున్నారు. డిస్కంలు కోరిన రూ.72,996 కోట్ల వ్యయాలకు గాను, ఈఆర్‌సీ రూ.64,950.72 కోట్లకు మాత్రమే అనుమతినిచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story