Yennam Srinivas Reddy: కల్వకుంట్ల కుటుంబ స్వార్థం కోసమే ఫోన్ ట్యాపింగ్.. పోలీసులకు ఎమ్మెల్యే ఎన్నం స్టేట్‌మెంట్!

Yennam Srinivas Reddy: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (IO) ఎదుట హాజరై స్టేట్‌మెంట్ నమోదు చేశారు.

Arun Chilukuri
Published on: 1 Jun 2026 3:37 PM IST
Yennam Srinivas Reddy
X

Yennam Srinivas Reddy: కల్వకుంట్ల కుటుంబ స్వార్థం కోసమే ఫోన్ ట్యాపింగ్.. పోలీసులకు ఎమ్మెల్యే ఎన్నం స్టేట్‌మెంట్!

Yennam Srinivas Reddy: తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో విచారణాధికారి (IO) నుంచి నోటీసులు అందుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి సోమవారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో తమ ఫోన్లు ఏ విధంగా ట్యాపింగ్‌కు గురయ్యాయనే అంశంపై అధికారులకు పూర్తి స్థాయి స్టేట్‌మెంట్లు ఇచ్చారు. అనంతరం అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా హాల్‌లో ఎన్నం శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవస్థలను అడ్డుపెట్టుకుని వేలాది మంది ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసిందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. "కల్వకుంట్ల కుటుంబంలోని నలుగురు (కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు) తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం కోసమే ఇటువంటి అప్రజాస్వామిక ధోరణులను అవలంబించారు. ప్రజా సమస్యలను పరిష్కరించి ఎన్నికల్లో గెలవలేక.. ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూశారు. వారి వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దొంగతనంగా ఉపయోగించుకోవాలనే కుట్ర చేశారు" అని ఎన్నం మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం ఏర్పడిందని.. కానీ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రప్రాంతాన్ని ఒక 'సర్వైలెన్స్ స్టేట్' (Surveillance State - నిఘా నీడలోని రాష్ట్రం)గా మార్చేశారని ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి వ్యక్తిగత సమస్య కాదు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులైన ఆర్టికల్ 14, ఆర్టికల్ 19లకు విరుద్ధంగా జరిగిన పెద్ద నేరమని పేర్కొన్నారు.

గత ఎన్నికల టైంలో నా ఫోన్‌తో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్, నాతో మాట్లాడిన వ్యక్తులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, ఆఖరికి న్యాయమూర్తుల (Judges) ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని విచారణలో వెల్లడైందన్నారు.

రాజ్యాంగాన్ని, పౌరుల స్వేచ్ఛను కాపాడతామని ప్రమాణం చేసి, స్వార్థ రాజకీయాల కోసం ఆ ప్రమాణాలను ఉల్లంఘించిన వారు ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా చట్టం ముందు జవాబుదారీగా నిలబడాల్సిందేనని ఎన్నం డిమాండ్ చేశారు. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు, ఎమ్మెల్యే నుంచి మాజీ ముఖ్యమంత్రి వరకు బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ వ్యవస్థీకృత నేరానికి (Organized Crime) పాల్పడిన వారిపై జూన్ నెలలోనే పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని చెప్పారని, న్యాయస్థానాలు ఈ వ్యవహారంలో కఠినమైన శిక్షలు విధిస్తాయని నమ్ముతున్నట్లు ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story