Jagtial: క్షేత్రస్థాయిలో కలెక్టర్ తనిఖీలు.. పనుల్లో నాణ్యతపై సీరియస్!
Jagtial: జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బీర్పూర్ మండలంలో పర్యటించి ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇళ్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణాలను పరిశీలించారు.
Jagtial: క్షేత్రస్థాయిలో కలెక్టర్ తనిఖీలు.. పనుల్లో నాణ్యతపై సీరియస్!
జగిత్యాల: జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతంగా, నాణ్యతతో కొనసాగాలి - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతంగా, నాణ్యతతో కొనసాగాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సూచించారు. ఈ మేరకు బుధవారం బీర్పూర్ మండలంలోని నరసింహులపల్లి గ్రామంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతిని సమగ్రంగా ఆరా తీసిన జిల్లా కలెక్టర్, కార్మికుల హాజరు నమోదు విధానం, NMMS యాప్ పరిశీలన, జియోట్యాగింగ్‌తో ఫోటో క్యాప్చరింగ్ ప్రక్రియలను పరిశీలించారు. పనుల వద్ద కార్మికుల హాజరు సరైన రీతిలో నమోదు చేయాలని, ఎలాంటి లోపాలు చోటు చేసుకోకుండా పర్యవేక్షణ బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ కార్మికులకు సముచిత ఉపాధి కల్పించడమే లక్ష్యమని, ప్రతి అర్హుడికి పని దొరికేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అనంతరం బీర్పూర్ మండల కేంద్రంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఇండ్ల నిర్మాణ పనులు నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేయాలని, లబ్ధిదారులకు వీలైనంత త్వరగా గృహాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
తదుపరి నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) భవనాన్ని కూడా పరిశీలించి పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రజలందరికి నాణ్యమైన మెరుగైన వైద్యం అందే విధంగా వైద్యులు అందరు కూడా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రఘువరన్, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఈఈపీఆర్ లక్ష్మణ్ రావు, తహసీల్దార్, ఎంపీడీఓ, సంబంధిత శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.


