Revanth Reddy: హైడ్రా పనులు ఆగేది లేదు.. మరింత బలోపేతం చేస్తాం

Revanth Reddy: హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆదేశాలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందన. హైడ్రాను మరింత బలోపేతం చేస్తామని, కబ్జాదారుల తప్పుడు కేసులను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామని స్పష్టీకరణ.

Arun Chilukuri
Published on: 28 July 2026 4:55 PM IST
Revanth Reddy
X

Revanth Reddy: హైడ్రా పనులు ఆగేది లేదు.. మరింత బలోపేతం చేస్తాం

Revanth Reddy: హైడ్రా కమిషనర్‌ నియామకం, పనితీరుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం సమగ్రంగా సమీక్షిస్తుందని వెల్లడించారు. కబ్జాకోరులు నకిలీ పత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైడ్రాపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు.

హైడ్రా అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక అతిపెద్ద సంస్కరణ అని, దీన్ని భవిష్యత్తులో మరింత బలోపేతం చేసి ఆక్రమణలపై చర్యలను కొనసాగిస్తామని సీఎం స్పష్టం చేశారు. చెరువులు, కుంటలు, నాలాలను కబ్జాల నుంచి కాపాడటమే హైడ్రా ముఖ్య విధి అని పునరుద్ఘాటించారు.

"బతుకమ్మకుంటను ఆక్రమిస్తే హైడ్రా కాపాడింది.. కానీ దానిపై కోర్టుకు వెళ్లారు. ఎన్ కన్వెన్షన్, గండిపేట చెరువుల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తే.. అవి పేదలవా?" అని సీఎం ప్రశ్నించారు. కబ్జాదారులు తమ అక్రమాలను కాపాడుకోవడానికి భారీగా డబ్బు ఖర్చు చేస్తూ సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.

గతంలో సీఎస్‌గా పనిచేసిన సోమేష్‌ కుమార్‌పై ఏకంగా 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉండేవి అని సీఎం గుర్తుచేశారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలి, ఏ బాధ్యతలు అప్పగించాలనేది ప్రభుత్వ విచక్షణాధికారమని స్పష్టం చేశారు. హైడ్రా వ్యవస్థపై ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, కబ్జాదారులు వేసే తప్పుడు కేసులను న్యాయస్థానాల్లోనే చట్టబద్ధంగా ఎదుర్కొంటామని రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story