Revanth Reddy: బాసర ఆలయానికి ₹225 కోట్లు.. తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశం!

Revanth Reddy: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి ₹225 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం. ఏప్రిల్ 6న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

Arun Chilukuri
Published on: 4 April 2026 4:53 PM IST
Revanth Reddy
X

Revanth Reddy: బాసర ఆలయానికి ₹225 కోట్లు.. తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశం!

Revanth Reddy: బాసరలోని పవిత్ర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి జరగాలని చెప్పారు.

నిర్మల్ జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ప్రభుత్వం 225 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు వివరించగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. 6వ తేదీన ఈ ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సువిశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భక్తుల విశ్వాసాలు దెబ్బతినకుండా ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు.

తిరుమల తిరుపతి తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు తావు లేకుండా నిబంధనలు ఉండాలని చెప్పారు. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story