Revanth Reddy: ఆదిలాబాద్‌లో వాయుసేన విమానాశ్రయం.. కేంద్ర రక్షణ మంత్రికి సీఎం రేవంత్ కీలక ప్రతిపాదనలు!
Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు.
Revanth Reddy: ఆదిలాబాద్‌లో వాయుసేన విమానాశ్రయం.. కేంద్ర రక్షణ మంత్రికి సీఎం రేవంత్ కీలక ప్రతిపాదనలు!
Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు రక్షణ రంగ ప్రాజెక్టులు, భూముల బదలాయింపు అంశాలపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అవసరమైన రక్షణ శాఖ (Defence) భూములను బదలాయించినందుకు గాను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రగతికి కేంద్ర రక్షణ శాఖ అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
దేశ సమగ్రత, భద్రతకు సంబంధించిన అంశం కావడంతో.. ఆదిలాబాద్‌లో వాయుసేన (Air Force) విమానాశ్రయ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని రక్షణ మంత్రికి సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఈ విమానాశ్రయంలో వాయుసేన టెర్మినల్‌తో పాటు కార్గో (Cargo), ఎమ్‌ఆర్‌వో (MRO), హ్యాంగర్ సౌకర్యాలను కల్పించాలని రక్షణ మంత్రిని కోరారు. విమానాల నిలుపుదలకు (హ్యాంగర్స్ ఏర్పాటుకు) ఆదిలాబాద్ విమానాశ్రయం భౌగోళికంగా ఎంతో అనుకూలంగా ఉంటుందని సీఎం ఈ సందర్భంగా వివరించారు.
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ సమీపంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ప్రాజెక్టును త్వరితగతిన మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల అనుమతులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రక్షణ, పారిశ్రామిక ప్రగతికి ఈ ప్రాజెక్టులు ఎంతో కీలకం కానున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి జరిపిన ఈ హస్తిన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.




