Revanth Reddy: సచివాలయంలో రేవంత్ రెడ్డితో లెఫ్ట్ పార్టీల భేటీ.. వడ్ల కొనుగోళ్లు, మూసీ ప్రాజెక్టుపై సీఎం కీలక వ్యాఖ్యలు!

Revanth Reddy: తెలంగాణ సచివాలయంలో సీపీఐ, సీపీఎం ప్రతినిధి బృందాలతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, మూసీ ప్రక్షాళన, విద్యా రంగంలో మార్పులపై వామపక్ష నేతలతో సుదీర్ఘంగా చర్చించారు.

Arun Chilukuri
Published on: 25 May 2026 5:52 PM IST
Revanth Reddy: సచివాలయంలో రేవంత్ రెడ్డితో లెఫ్ట్ పార్టీల భేటీ.. వడ్ల కొనుగోళ్లు, మూసీ ప్రాజెక్టుపై సీఎం కీలక వ్యాఖ్యలు!
X

Revanth Reddy: కేంద్ర ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) పెంచడం మినహా క్షేత్రస్థాయిలో పంటలను సేకరించడంలో పూర్తిగా విఫలమవుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం కనీసం 30 శాతం పంటను కూడా సేకరించడం లేదని, కానీ తెలంగాణలో మాత్రం రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో (సెక్ట్రేరియట్) సీపీఎం, సీపీఐ ప్రతినిధి బృందాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో వేర్వేరుగా భేటీ అయ్యాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో ఆయా పార్టీల అగ్రనేతలు సీఎంతో సమావేశమై రాష్ట్రంలోని పలు ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల కనీస వేతనాల (Minimum Wages) పెంపుపై రేవంత్ సర్కార్ సానుకూల నిర్ణయం తీసుకోవడం పట్ల వామపక్ష నేతలు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత ధాన్యం కొనుగోళ్ల తీరు, మూసీ నది ప్రక్షాళన, విద్యా రంగంలో సంస్కరణలపై సీఎం మరియు లెఫ్ట్ పార్టీల నేతల మధ్య ప్రధానంగా చర్చ సాగింది.

ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న కొన్ని ఇబ్బందులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల కారణంగా తెలంగాణలో పనిచేస్తున్న చాలామంది హమాలీలు వారి స్వస్థలాలకు వెళ్లడం వల్లే ఇక్కడ ఐకేపీ కేంద్రాల్లో కొంత కొరత ఏర్పడిందని సీఎం వివరించారు. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల మధ్యాహ్నం వేళల్లో పని జరగడం లేదని, అయినప్పటికీ తాము నిరంతరం సమీక్షిస్తూ కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామని, మొక్కజొన్నను కూడా మద్దతు ధరకే సేకరిస్తున్నామని తెలిపారు.

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా మాట్లాడారు. మూసీ కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా ప్రజల జీవితాలు ఛిద్రమవుతున్నాయని, అది వారికి జీవన్మరణ సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

"మూసీ నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బాధితులందరికీ స్థానికంగానే డబుల్ బెడ్‌రూమ్ నివాసాలు మంజూరు చేస్తాం. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కొన్ని శక్తులు అనవసర రాజకీయం చేయడం తగదు. మూసీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి హైదరాబాద్ లోనే ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం" అని సీఎం స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని, విప్లవాత్మక మార్పులతో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ (Telangana Public Schools) ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. తమ ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్య, కార్పొరేట్ తరహా వసతులను పరిశీలించడానికి రంగారెడ్డి జిల్లాలోని 'ఆరుట్ల పాఠశాల'ను ఒకసారి సందర్శించాలని సీపీఎం నేతలకు రేవంత్ సూచించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, పౌష్టికాహారంతో కూడిన బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు సీఎం వామపక్ష నేతలకు వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story