Revanth Reddy: స్కూల్ బస్సులో సీఎం రేవంత్ ప్రయాణం.. ఆరుట్లలో 'తెలంగాణ పబ్లిక్ స్కూల్' ప్రారంభం!
Revanth Reddy: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తొలి 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రారంభించారు.
Revanth Reddy: స్కూల్ బస్సులో సీఎం రేవంత్ ప్రయాణం.. ఆరుట్లలో 'తెలంగాణ పబ్లిక్ స్కూల్' ప్రారంభం!
Revanth Reddy: తెలంగాణ విద్యా రంగంలో సరికొత్త చరిత్ర లిఖిస్తూ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ప్రతిష్టాత్మక 'తెలంగాణ పబ్లిక్ స్కూల్' (TPS) ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రారంభించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ మోడల్ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి ప్రయాణం నుంచి ముగింపు వరకు అత్యంత ఆత్మీయంగా, ఆసక్తికరంగా సాగింది.
బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో రంగారెడ్డి జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ దిగిన అనంతరం సీఎం వినూత్నంగా ఆలోచించారు. కాన్వాయ్ కార్లను పక్కన పెట్టి, హెలిప్యాడ్ నుండి నేరుగా పాఠశాల ప్రాంగణం వరకు 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'కు చెందిన విద్యార్థుల బస్సులోనే ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
పాఠశాలను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) చేశారు. విద్యార్థుల చదువులు, వసతులపై స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం పాఠశాలలోని ప్రీ-ప్రైమరీ విభాగాలు, అత్యాధునిక డిజిటల్ తరగతి గదులు, విశాలమైన లైబ్రరీని పరిశీలించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచే ఇన్నోవేషన్ ల్యాబ్‌తో పాటు ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ ప్రయోగశాలలను సందర్శించి అక్కడి ప్రపంచస్థాయి వసతులను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా సీఎం రేవంత్ రెడ్డి మొక్క నాటారు. ఆపై స్కూల్లోని డ్యాన్స్, మ్యూజిక్ రూమ్‌లను సందర్శించి పిల్లల ప్రతిభను మెచ్చుకున్నారు. అనంతరం స్కూల్ ఫుట్‌బాల్ మైదానానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. కోటు విప్పేసి, విద్యార్థులతో కలిసి కాసేపు ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఆడి అక్కడున్న వారందరిలో జోష్ నింపారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆరుట్లలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మహత్తర కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డిలతో పాటు పలువురు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




