Assembly Elections 2026: మోడీ-విజయన్ ఒక్కటే.. కేరళలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Assembly Elections 2026: కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Assembly Elections 2026: మోడీ-విజయన్ ఒక్కటే.. కేరళలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Assembly Elections 2026: కేరళంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్-LDF కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. కేరళంలోని నేమం సహా పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేమం నియోజకవర్గంలో UDF అభ్యర్థి కేఎస్ శబరీనాథన్ తరఫున.. పూంథురలో సీఎం రేవంత్ రోడ్ షోలో పాల్గొన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను కేరళంలోకి రానీయకుండా లక్ష్మణరేఖ గీసింది UDF అని అన్నారు. ఢిల్లీ కమ్యూనిస్ట్ ప్రధాని మోడీతో పాటు త్రివేండ్రం కమ్యూనిస్ట్ సీఎం పినరయి విజయన్‌ను ఓడిస్తేనే కేరళంకు మంచి రోజులు వస్తాయన్నారు. మోడీ-విజయన్‌వి విభిన్న భావాజాలాలైనా.. భావాలొక్కటేనని, ఎల్డీఎఫ్-బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని విమర్శనాస్త్రాలు సంధించారు సీఎం రేవంత్‌రెడ్డి.
కేరళంలోని జాతీయ రహదారులు సహా పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాని.. సీఎం పినరయి విజయన్ నోరు మెదపడం లేదని ఆయన మండిపడ్డారు. కేరళ ప్రజలు బీజేపీ, LDF కు గుణపాఠం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ కేరళం భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తున్నారని సీఎం విమర్శించారు. బీజేపీ-సీపీఎం మధ్య సైలెంట్ అండర్ స్టాండింగ్ ఉందని.. అందుకే వారిపై ఎలాంటి కేసులు ఉండవని అన్నారు. దేశంలో ఎవరినైనా బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐతో వేధిస్తారని.. కానీ, విజయన్ సర్కార్‌పై ఈగ కూడా వాలనీయరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, LDF.. బయటకు పోటీ పడుతున్నట్టు కనిపించినా, అది ఉత్తిత్తిదేనని ఎద్దేవా చేశారు.
కేరళం సమగ్రాభివృద్ధి UDF లక్ష్యమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. విద్యావంతులైన ఎందరో మలయాళీలు స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని.. వారికి స్థానికంగా ఉపాధి కల్పించే పరిశ్రమలు తగిన సంఖ్యలో లేవన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు కేరళం సమగ్రాభివృద్ధికి UDF ప్రణాళికలు రచిస్తోందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలు, యువతకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు సీఎం రేవంత్. హస్తం పార్టీకి ఓటేస్తే.. పాత కేరళం ఏమిటో మళ్లీ చూపిస్తామని హామీ ఇచ్చారు. డెవలప్‌మెంట్ విత్ డిగ్నిటీతో ముందుకు వెళ్తున్నామని.. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
సామాజిక ప్రగతి, అభివృద్ధి, అక్షరాస్యతలో కేరళం ఎప్పటినుంచో యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని.. అందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన కృషే కారణమని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. విద్యారంగంలో కేరళంలో కాంగ్రెస్‌ప్రభుత్వాలు సాధించిన ప్రగతిని సీఎం వివరించారు. దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళంకు ఉన్న గుర్తింపును సీఎం రేవంత్ నొక్కి చెప్పారు. విద్య, అవగాహన, సామాజిక చైతన్యంలో కేరళం దేశానికి అప్పటికీ.. ఇప్పటికీ.. నమూనాగా ఉందని సీఎం తెలిపారు. ఇందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోని ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఊమెన్ చాందీ, ఏకే ఆంటోనీల కృషి ప్రధాన కారణమన్నారు సీఎం రేవంత్.
కేరళంకు కరుణాకరన్, ఊమెన్ చాందీ, ఏకే ఆంటోనీ.. సమగ్ర, సమ్మిళిత, సమతుల్య, నిష్కళంక రాజకీయాలను అందించారని సీఎం రేవంత్ కొనియాడారు. కరుణాకరన్ కేరళంలో అభివృద్ధికి బాటలు వేశారని, ఊమెన్ చాందీ సంక్షేమం-అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యం కల్పించారని.. ఏకే ఆంటోనీ నిజాయితీకి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పాలనలో కేరళంకు గౌరవం, నమ్మకం, పరిపాలనా స్థిరత్వం వచ్చిందన్నారు. కేరళంను “గాడ్స్ ఓన్ కంట్రీ” గా పిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే.. దేశంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా కేరళం ఒక బ్రాండ్‌గా నిలిచిందన్నారు. పర్యాటకం, విద్య, ఆరోగ్యం, సామాజిక పురోగతి.. ఇవన్నీ కేరళంను ఒక ప్రత్యేక రాష్ట్రంగా నిలబెట్టాయన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
గత 12 ఏళ్లుగా ఢిల్లీలోనూ.. పదేళ్లుగా కేరళంలోనూ పరిస్థితులను పూర్తిగా దిగజారాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మోడీ, కేరళంలో విజయన్ డబుల్ ఫెయిల్యూర్ గా నిలిచారని సీఎం విమర్శించారు. ఢిల్లీలో మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం, తిరువనంతపురంలో విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ సర్కారుతో దేశం, రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లాయని విమర్శించారు. వీరి ఇరువురి సిద్ధాంతాలు వేరయినా.. వైఫల్యాలు మాత్రం ఒకేలా ఉన్నాయని మండిపడ్డారు. నిరుద్యోగంతో ఇక్కడి యువత ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. సోనియా గాంధీ దత్తత తీసుకున్న తెలంగాణ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని.. కేరళం కూడా అలానే ముందుకు వెళ్లాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
కేరళం అభివృద్ధికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం వహిస్తారని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేరళం కుటుంబ సభ్యుల్లా మారారని సీఎం తెలిపారు. మలయాళీ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నరసింహం సినిమాలో చెప్పిన “నీ పో మోనే.. దినేశా..” స్టైల్‌లో “నీ పో మోనే విజయన్.. యువర్ టైమ్ ఈజ్ ఓవర్” అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన డైలాగ్‌కు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో యంగ్ సీఎం.. డైనమిక్ సీఎం అంటూ అక్కడి కార్యకర్తలు నినాదాలు చేయడంతో సభ ఒక్కసారిగా దద్దరిల్లింది.




