Revanth Reddy: రెండేళ్లు సమయం ఇవ్వండి.. గురువుల ప్రతి సమస్యను తీరుస్తాం
Revanth Reddy: ఉపాధ్యాయుల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
Revanth Reddy: రెండేళ్లు సమయం ఇవ్వండి.. గురువుల ప్రతి సమస్యను తీరుస్తాం
Revanth Reddy: రాష్ట్రంలో విద్యాశాఖను ప్రక్షాళన చేస్తూ అనేక కీలక మార్పులు తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. ఉపాధ్యాయులతో కలిసి ముచ్చటించారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసేది గురువులేనని కొనియాడారు. ఉపాధ్యాయులు తమకు రెండేళ్ల సమయం ఇస్తే, పెండింగ్‌లో ఉన్న ప్రతి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
చాలాకాలంగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియను తమ ప్రభుత్వం పూర్తి చేసిందని సీఎం తెలిపారు. టీచర్ల బదిలీల విషయంలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, సాంకేతిక విద్యను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తోందని చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యాశాఖ కమిషన్ ద్వారా అనేక సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతున్నామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీఆర్సీ సమస్యను కూడా పరిష్కరించినట్లు గుర్తుచేశారు.
ఇలాంటి సంక్షేమ చర్యలు తీసుకుంటున్న తరుణంలో, ఇటీవల ఇందిరాపార్కు వద్ద ఉపాధ్యాయులు తమ సమస్యలపై ధర్నా చేయడం తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నానని, ఉపాధ్యాయుల కష్టాలు తనకు తెలుసని అన్నారు. అంతకుముందు కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన ముఖ్యమంత్రి.. ఉపాధ్యాయులతో కలిసి ఉత్సాహంగా గ్రూప్ ఫోటో దిగారు.




