Revanth Reddy: విమర్శల తర్వాత ఒక్కటైన రేవంత్, కిషన్ రెడ్డి.. కేంద్ర మంత్రులతో మెట్రోపై సానుకూల చర్చలు!

Revanth Reddy: హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టు నిధులు, ఐఆర్‌ఏఫ్‌సీ (IRFC) రుణాల విడుదలపై కేంద్రమంత్రి మనోహార్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్‌లతో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జరిపిన కీలక భేటీ ముగిసింది.

Arun Chilukuri
Published on: 23 Jun 2026 12:29 PM IST
Revanth Reddy
X

Revanth Reddy: విమర్శల తర్వాత ఒక్కటైన రేవంత్, కిషన్ రెడ్డి.. కేంద్ర మంత్రులతో మెట్రోపై సానుకూల చర్చలు!

Revanth Reddy: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశ (Metro Phase-2) నిధులు, అనుమతుల సాధనే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరుపుతున్న పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహార్‌ లాల్ ఖట్టర్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిల భేటీ ముగిసింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం పాల్గొనడం విశేషం. మెట్రో రెండో ఫేజ్‌కు కేంద్ర నిధులు, త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.

అంతకుముందు రోజు (సోమవారం) రైల్వేశాఖ మంత్రి అశ్విణీ వైష్ణవ్‌తో సీఎం రేవంత్, కిషన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో మెట్రో ఫేజ్‌-2 పనులు, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి రావాల్సిన రుణాల విడుదలపై లోతుగా చర్చించారు. ఈ చర్చలు అత్యంత సానుకూలంగా సాగాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రులతో వరుస భేటీల అనంతరం మెట్రో నిధుల విడుదలపై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఒక అధికారిక లేఖ రాశారు. తెలంగాణ అభివృద్ధి ప్రయోజనాల దృష్ట్యా మెట్రో ప్రాజెక్టు నిధుల కోసం కేంద్ర మంత్రులతో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేయాలని అందులో కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కిషన్ రెడ్డి.. చొరవ తీసుకుని కేంద్ర రైల్వే, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులతో ఈ ఉమ్మడి సమావేశాలను షెడ్యూల్ చేయించారు.

ఇటీవలి కాలంలో మెట్రో ఫేజ్-2 పనులను, నిధులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో రాజకీయ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. "తెలంగాణలో బీజేపీ ఉండాలా వద్దా?" అని కిషన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించడం వల్లే లోన్ ఆగిపోయిందని సీఎం విమర్శించారు.

అయితే, ఈ తాజా భేటీల సందర్భంగా సీఎం రేవంత్ తన వ్యాఖ్యలపై స్పష్టతనిస్తూ.. "కిషన్ రెడ్డి పట్ల తనకు ఎలాంటి వ్యక్తిగత వ్యతిరేకత లేదు. మెట్రో విషయంలో ఆయన తెలంగాణ ప్రయోజనాల కోసం ధైర్యంగా నిలబడితే తానే ముందుండి అండగా ఉంటాను" అని పేర్కొన్నారు. ఒకవేళ కేంద్రం నుండి మెట్రో లోన్ త్వరగా విడుదల కాకపోతే, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story