కొత్త సర్పంచ్‌లకు కేంద్రం ఊరట.. రూ. 248 కోట్ల నిధులతో పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన!

Telangana Gram Panchayats: తెలంగాణలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.

Arun Chilukuri
Published on: 31 March 2026 2:35 PM IST
కొత్త సర్పంచ్‌లకు కేంద్రం ఊరట.. రూ. 248 కోట్ల నిధులతో పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన!
X

కొత్త సర్పంచ్‌లకు కేంద్రం ఊరట.. రూ. 248 కోట్ల నిధులతో పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన!

Telangana Gram Panchayats: తెలంగాణలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని పంచాయతీ రాజ్ సంస్థలకు రూ. 247.94 కోట్ల అన్‌టైడ్ గ్రాంట్లను (Untied Grants) విడుదల చేస్తూ కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇవి తొలి విడత నిధులు.

అభివృద్ధికే ఖర్చు.. జీతాలకు నో!

ఈ నిధుల వినియోగంపై కేంద్రం పక్కా నిబంధనలు విధించింది. ఈ గ్రాంట్లను కేవలం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకే వాడాలని స్పష్టం చేసింది. అంతర్గత రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం మరియు శ్మశాన వాటికల అభివృద్ధికి వీటిని ఉపయోగించాలి. పంచాయతీ సిబ్బంది జీతాలు, పెన్షన్లు లేదా కార్యాలయ నిర్వహణ ఖర్చుల (అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు) కోసం ఈ నిధులను మళ్లించడానికి వీల్లేదని కేంద్రం కరాఖండిగా చెప్పింది.

గ్రామసభ ఆమోదం తప్పనిసరి:

రాష్ట్రంలోని సుమారు 12,600 గ్రామ పంచాయతీలకు ఈ నిధులు అందనున్నాయి. ఈ నిధులను ఖర్చు చేయాలంటే తప్పనిసరిగా గ్రామసభ ఆమోదం ఉండాలి. నిధులు అక్రమదారి పట్టకుండా 'ప్రతి రూపాయి ఆడిట్' చేయాలని కేంద్రం ఆదేశించింది. అలాగే, చేపట్టిన పనుల వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది.

సర్పంచ్‌ల పాలనలో వేగం:

తెలంగాణలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు ముగిసి, కొత్తగా సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల ప్రత్యేక అధికారుల పాలన తర్వాత మళ్లీ ప్రజాప్రతినిధులు రావడంతో, ఈ కేంద్ర నిధులు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఊతమివ్వనున్నాయి. నిధులను నేరుగా స్థానిక సంస్థల ఖాతాల్లోనే జమ చేయనుండటంతో పనులు మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story