Weather Update : సూర్యుడికి, వరుణుడికి మధ్య యుద్ధం.. ఏపీ, తెలంగాణలో అల్లకల్లోలం సృష్టిస్తున్న రాకాసి గాలులు
Weather Update : నేడు ఏపీ, తెలంగాణలో భూమధ్య రేఖ ప్రభావంతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు, పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇప్పుడు ఒక పట్టాన అర్థం కావడం లేదు. ఎండాకాలం కాస్తా వానాకాలంలా మారుతోంది. భూమధ్య రేఖ ప్రాంతంలో కనిపించే వింతైన వాతావరణ మార్పులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా ఇండొనేషియా, మలేషియా వంటి భూమధ్య రేఖ దగ్గర ఉండే దేశాల్లో ప్రతిరోజూ ఎండ, వాన రెండూ ఉంటాయి. అక్కడ సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల నీరు త్వరగా ఆవిరై మేఘాలుగా మారి సాయంత్రానికి వర్షం పడుతుంది. ఇప్పుడు మన దగ్గర కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎండలు మండిపోతుంటే, మరోవైపు అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం భూమధ్య రేఖ వద్ద బలపడిన ఇన్వెస్ట్ 99S అనే అల్పపీడన సుడిగుండం. ఇది గంటకు 35 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ మన వైపు తేమతో కూడిన గాలులను పంపుతోంది.
హైదరాబాద్‌లో జల్లులు
తెలంగాణ వాతావరణాన్ని గమనిస్తే, నేడు (మార్చి 31, మంగళవారం) మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఉదయం 10 గంటల వరకు ఉత్తర మరియు మధ్య తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఆకాశం దట్టమైన మేఘాలతో నిండి ఉంటుంది. ఇక మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం పూర్తిగా చల్లబడుతుంది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాత్రి 8 గంటల వరకు ఈ వాతావరణం ఇలాగే కొనసాగవచ్చు. గాలిలో తేమ 41 శాతంగా నమోదవుతోంది.
రాయలసీమలో మేఘాలు.. ఉత్తరాంధ్రలో వానలు
ఏపీలో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే సాయంత్రం 3 గంటల తర్వాత సీన్ మారిపోతుంది. విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. రాయలసీమలో మాత్రం దట్టమైన మేఘాలు కమ్ముకుంటాయి కానీ, కొన్ని చోట్ల మాత్రమే జల్లులు పడే అవకాశం ఉంది. కోస్తా తీరంలో వర్షాల ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈదురు గాలులతో ప్రమాదం.. జాగ్రత్త!
వర్షం కంటే నేడు గాలులతోనే ముప్పు ఎక్కువగా ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురు గాలులు వీస్తాయి. వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉంది. తెలంగాణలో కూడా గంటకు 25 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉండవద్దని వాతావరణ శాఖ ప్రజలను కోరుతోంది.
రైతులకు ఆందోళన.. పర్యావరణ వేత్తల హెచ్చరిక
ఎండల నుంచి ఈ వానలు కొంత ఉపశమనం ఇస్తున్నా, రైతన్నలకు మాత్రం ఇవి కన్నీటిని మిగిలిస్తున్నాయి. కోత దశలో ఉన్న పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే అంటార్కిటికాలో జరుగుతున్న వాతావరణ మార్పులు, చందమామ ఆకర్షణ శక్తి వల్ల సముద్ర నీరు అల్లకల్లోలం కావడం వంటివన్నీ ఈ వింత మార్పులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. భూతాపం వల్ల గాలి బరువు తగ్గి ఇలా ఉరుకులు పరుగులు పెడుతోందని, ఇది దీర్ఘకాలంలో పర్యావరణానికి ముప్పు అని హెచ్చరిస్తున్నారు.




