Bhatti Vikramarka: ఆ మూడు బ్యారేజీలు ఎందుకు కట్టారో గత ప్రభుత్వం సమాధానం చెప్పాలి

Bhatti Vikramarka: ములుగు జిల్లాలోని తుపాకులగూడెం సమ్మక్క సాగర్ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు.

Arun Chilukuri
Published on: 13 July 2026 3:54 PM IST
Bhatti Vikramarka
X

Bhatti Vikramarka: ఆ మూడు బ్యారేజీలు ఎందుకు కట్టారో గత ప్రభుత్వం సమాధానం చెప్పాలి

Bhatti Vikramarka: రాష్ట్రంలో లభ్యతగా ఉన్న గోదావరి జలాలను సాధ్యమైనంత వరకు గరిష్టంగా వినియోగించుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం సందర్శించారు.

హెలికాప్టర్‌లో ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మంత్రుల బృందానికి ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వస్సల్ టోప్పో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు సమ్మక్క బ్యారేజ్, దేవాదుల ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి వరద నీటి వినియోగం, కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ ప్రస్తుత పరిస్థితిపై మంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సమ్మక్క బ్యారేజ్‌లో గేట్లు మూసివేయడం వల్ల ప్రస్తుతం 71 మీటర్ల ఎత్తులో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. దీనివల్ల దేవాదుల ప్రాజెక్టుకు చెందిన 7 మోటార్లను నిరంతరాయంగా నడుపుతూ నీటిని విజయవంతంగా ఎత్తిపోస్తున్నామని వివరించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ఎందుకు పనిచేయడం లేదంటూ విమర్శలు చేసేవారు ముందుగా క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు.

మేడిగడ్డ బ్యారేజ్ భద్రతపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగానే ప్రభుత్వం అడుగులు వేస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. "మేడిగడ్డ వద్ద గేట్లు మూసివేస్తే బ్యారేజ్ కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. వారి సూచనలను ప్రాణప్రదంగా పాటిస్తూ ముందుకు సాగుతున్నాం" అని తెలిపారు. నదిలో పారే నీటిని నేరుగా ఎత్తిపోసుకునే సాంకేతిక అవకాశం ఉన్నప్పుడు.. వేల కోట్లు ఖర్చు చేసి మూడు బ్యారేజీలను ఎందుకు నిర్మించారో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చే నివేదికలను బట్టే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story