హైదరాబాద్ సమీపంలో బెస్ట్ వీకెండ్ స్పాట్స్.. ఈ 5 అందమైన ప్రదేశాలను అస్సలు మిస్ అవ్వకండి!
Hyderabad: వీకెండ్‌లో ప్రశాంతంగా, ఉత్సాహభరితంగా గడపడానికి అద్భుత పర్యాటక ప్రాంతాల కోసం ఎదురుచూస్తున్నారా?. ఈ 5 ప్రదేశాలను మిస్ అవ్వకండి.
హైదరాబాద్ సమీపంలో బెస్ట్ వీకెండ్ స్పాట్స్.. ఈ 5 అందమైన ప్రదేశాలను అస్సలు మిస్ అవ్వకండి!
Hyderabad: హైదరాబాద్ మహా నగరంలో రోజువారీ బిజీ లైఫ్, ఉద్యోగ బాధ్యతలు, తీరిక లేని పనులతో అలసిపోయి ఉన్నారా?.. వీకెండ్‌లో ప్రశాంతంగా, ఉత్సాహభరితంగా గడపడానికి మంచి పర్యాటక ప్రాంతాల కోసం ఎదురుచూస్తున్నారా?.. అయితే మీకోసం భాగ్యనగరానికి అతి సమీపంలోనే పలు అందమైన, మంత్రముగ్ధులను చేసే ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి.
వీటిని సందర్శించడం ద్వారా మీ అలసట దూరమై నయా ఉత్సాహం లభిస్తుంది. అందులోనూ పర్యాటకులను వేల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లే చారిత్రక వారసత్వ ప్రదేశాలు కూడా ఉండటం విశేషం. హైదరాబాద్ నగరానికి చేరువలో ఉన్న 5 ప్రముఖ వీకెండ్ పర్యాటక ప్రాంతాల వివరాలు ఇక్కడ చూద్దాం.
1. వరంగల్ (మహోన్నత కాకతీయ వైభవం):
12వ శతాబ్దం నాటి సంస్కృతిని, వైభవాన్ని ప్రత్యక్షంగా అనుభవించాలనుకుంటే వరంగల్ పర్యటన బెస్ట్ ఆప్షన్. ఈ పురాతన నగరంలో కాకతీయుల పాలన నాటి అద్భుత శిల్పకళా రీతులు నేటికీ స్పష్టంగా కనిపిస్తాయి.
ప్రధాన ఆకర్షణలు: నక్షత్ర ఆకారంలో తీర్చిదిద్దిన వెయ్యి స్తంభాల ఆలయం, వరంగల్ కోట, కాకతీయ కళాతోరణాలు.
హైదరాబాద్ నుంచి దూరం: 148 కిలోమీటర్లు
ప్రయాణ సమయం: సుమారు 3 గంటలు
2. నాగార్జున సాగర్ (ప్రపంచంలోనే ఎత్తైన రాతి ఆనకట్ట):
ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రాతి ఆనకట్టలలో ఒకటిగా, అతిపెద్ద కృత్రిమ సరస్సు ఉన్న ప్రాంతంగా నాగార్జున సాగర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 124 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ఆనకట్టకు 26 గేట్లు ఉన్నాయి. స్నేహితులు, కుటుంబంతో సరదాగా గడపడానికి బెస్ట్ వీకెండ్ స్పాట్.
ప్రధాన ఆకర్షణలు: సరస్సు మధ్యలో ఉండే నాగార్జునాకొండ ద్వీపం. పడవ (బోటింగ్) ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ప్రాచీన బౌద్ధ నిర్మాణాల తవ్వకాలు, మ్యూజియం ఇక్కడి ప్రత్యేకత.
హైదరాబాద్ నుంచి దూరం: 165 కిలోమీటర్లు
ప్రయాణ సమయం: 3 నుంచి 4 గంటలు
3. కరీంనగర్ (ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలు):
మానేరు నది ఒడ్డున ఉన్న కరీంనగర్ వేద అభ్యాస కేంద్రంగా, ప్రముఖ యాత్రా స్థలంగా పేరుగాంచింది. పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు ప్రకృతి అందాలు ఇక్కడ ప్రతి ఒక్కరిని అలరిస్తాయి.
ప్రధాన ఆకర్షణలు: ప్రసిద్ధ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం (వేములవాడ), ముక్తేశ్వర స్వామి ఆలయం, మానేరు డ్యామ్ ప్రశాంత వాతావరణం, డీర్ పార్క్ (జింకల పార్కు).
హైదరాబాద్ నుంచి దూరం: 164 కిలోమీటర్లు
ప్రయాణ సమయం: 3 నుంచి 4 గంటలు
4. పాఖాల్ సరస్సు (అడవి మధ్యలో అడ్వెంచర్ అనుభూతి):
మానవ నిర్మిత సరస్సు ఒడ్డున, అటవీ వాతావరణంలో నైట్ క్యాంప్ ఫైర్, సాహస పర్యటనలను కోరుకునే వారికి పాఖాల్ సరస్సు సరైన గమ్యస్థానం. మాములుగా దీన్ని పాఖాల చెరువు అని కూడా పిలుస్తారు. స్నేహితులతో కలిసి క్యాంపింగ్ చేయడానికి ఇది అత్యంత ఆహ్లాదకరమైన ప్రదేశం.
ప్రధాన ఆకర్షణలు: పాఖాల్ వన్యప్రాణుల అభయారణ్యం, సరస్సు తీరాన ప్రకృతి అందాలు.
హైదరాబాద్ నుంచి దూరం: 198 కిలోమీటర్లు
ప్రయాణ సమయం: సుమారు 4-5 గంటలు
5. నిజామాబాద్ (చారిత్రక సంస్కృతి, జలపాతాలు)
భారతీయ సంస్కృతిని, గొప్ప పురాతన నిర్మాణాల ప్రాముఖ్యతను చాటిచెప్పే నగరాలలో నిజామాబాద్ ఒకటి. ట్రెకింగ్ మరియు పర్వతారోహణ చేయాలనుకునే వారికి ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో ఇక్కడికి వెళితే బాగా ఎంజాయ్ చేయొచ్చు.
ప్రధాన ఆకర్షణలు: 500 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన శ్రీ నీలకంటేశ్వర ఆలయం, పచ్చని కొండలు, జలపాతాలు.
హైదరాబాద్ నుంచి దూరం: 176 కిలోమీటర్లు
ప్రయాణ సమయం: 4 గంటలు




