Karimnagar: కరీంనగర్‌లో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు!
Karimnagar: కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం.
Karimnagar: కరీంనగర్‌లో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు!
Karimnagar: తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేడుకలు పేరు వినగానే ఠక్కున భద్రాచలం గుర్తుకొస్తుంది. అత్యంత అంగరంగ వైభవంగా భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్రస్వామి దంపతుల పెళ్లి వేడుకలు జరుగుతాయి. వేలాది మంది భక్తులు ఆ పెళ్లి వేడుకలను స్వయంగా వీక్షించేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా భద్రాద్రి వెళతారు. ఇప్పుడు భద్రాద్రి తరువాత ఆ తరహాలో సీతారామచంద్రస్వామి వేడుకలు జరిపేందుకు కరీంనగర్ వేదికగా మారింది. సాధారణ ప్రజలు నిర్వహించే పెళ్లి వేడుకల తరహాలోనే కరీంనగర్ లో రామయ్య, సీతమ్మ పెళ్లి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు. హంపి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్యభారతి స్వామీజీ ఆశీస్సులతో ముగ్గురమ్మలు కొలువైన శ్రీ మహాశక్తి ఆలయాన్ని రామయ్య, సీతమ్మ పెళ్లి వేడుకల కోసం అత్యంత సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.
చలువ పందిళ్లు.. తప్పట్లు.. తాళాలు.. తలంబ్రాలు రడీ..
పెళ్లంటే పందిళ్లు, తప్పట్లు, తాళాలు, తలంబ్రాలు అనే నానుడిని నిజం చేస్తూ అమ్మవారి ఆలయంలో పెద్ద ఎత్తున చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఇక తప్పట్లు, తాళాలు సరేసరి. ఒకేసారి 25 వేల మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఎల్ ఈడీ స్క్రీన్లను అమర్చారు. సీతారామచంద్రస్వామి పెళ్లి వేడుకలకు హాజరయ్యే భక్తులందరికీ వేద పండితుల ఆశీర్వచనంతోపాటు తలంబ్రాలను అందజేయనున్నారు. ఉదయం 9 గంటలకు సీతారామచంద్రుడి పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. వేడుకలు నిర్వహించే అర్చకులు సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా ఒక్కో ఘట్టాన్ని వివరించనున్నారు. మధ్య మధ్యలో స్వామి వారికి గాన సేవ చేస్తారు.
విశాలమైన పెళ్లి పందిరి.. తీరొక్క పూలతో అలంకరణ.
రామయ్య-సీతమ్మ పెళ్లి వేడుకల కోసం శ్రీ మహాశక్తి ఆలయాన్ని అత్యంత సుందరంగా పూలతో ముస్తాబు చేస్తున్నారు. తీరొక్క పూలతో దేవాలయాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు. విద్యుత్ కాంతులతో ధగధగలాడేలా ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. విశాలమైన పెళ్లి పందిరిని ఏర్పాటు చేసి పూలతో అలంకరిస్తున్నారు.
కూలర్లు, మజ్జిగ, మంచినీళ్లు సిద్ధం
ఎండాకాలం కావడంతో నవమి వేడుకలకు హాజరయ్యే భక్తులకు, చిన్నారులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ప్రతి ఒక్క భక్తుడి దాహార్తిని తీర్చేందుకు మంచి నీళ్లు, మజ్లిగను అందుబాటులో ఉంచారు.
25 వేల మందికి సరిపడా ఘుమఘుమలాడే వంటకాలు రడీ
శ్రీ మహాశక్తి ఆలయంలో సీతమ్మ-రామయ్య పెళ్లి వేడుకలకు హాజరయ్యే భక్తులకు భోజన, ప్రసాదాలు సైతం అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 25 వేల మంది భక్తులు నవమి వేడుకలకు హాజరవుతారని అంచనా వేస్తున్న ఆలయ నిర్వాహకులు అందరికీ సరిపడా భోజనాలు, ప్రసాదాలను సిద్ధం చేస్తున్నారు. పెళ్లి సమయంలో ఏ విధంగా భోజనాలను సిద్ధం చేస్తారో. అదే తరహాలో మూడు రకాల కూరలు, సాంబార్, పెరుగు, స్వీట్, పులిహోర సహా ప్రత్యేక వంటకాలను వడ్డించేందుకు సిద్ధమయ్యారు. భక్తులకు భోజన సమయంలో క్యూ కట్టే పనిలేకుండా 5 స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక వంటశాలను ఏర్పాటు చేసి ఈరోజు రాత్రి నుండే వంటలు ప్రారంభించనున్నారు.
సీతారామచంద్రస్వామి పెళ్లి వేడుకలకు తరలిరండి
కరీంనగర్ లోని శ్రీమహాశక్తి ఆలయంలో నిర్వహించే సీతారామచంద్రస్వామి పెళ్లి వేడుకలకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. శ్రీరామ నవమి వేడుకలకు హాజరయ్యే భక్తులందరికీ ఇబ్బందుల్లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులందరికీ వేదపండితుల ఆశీర్వచనంతోపాటు తలంబ్రాలను అందజేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.




