Bakrid 2026 Holiday: ముస్లిం సోదరులకు అలర్ట్.. మారిన బక్రీద్ సెలవు తేదీ..!
Bakrid 2026 Holiday: తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదరులకు అలర్ట్. చంద్రదర్శనం ఆలస్యం కావడంతో బక్రీద్ పండుగ సెలవు తేదీని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సవరించాయి.
Bakrid 2026 Holiday: ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన బక్రీద్ (ఈద్ అల్-అధా) పండుగ ప్రభుత్వ సెలవుదినాన్ని మారుస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ పాత అధికారిక క్యాలెండర్ ప్రకారం మొదట మే 27, 2026 న బక్రీద్ సెలవుగా ప్రకటించగా.. దానిని ఇప్పుడు మే 28, 2026 (గురువారం) నాటికి మారుస్తూ ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వేర్వేరుగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశాయి.
ఇస్లామిక్ క్యాలెండర్‌లోని చివరి నెల అయిన 'ధు అల్-హిజ్జా' (Dhul-Hijjah) 10వ రోజున ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారు. అయితే ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం ముస్లిం పండుగలు పూర్తిగా చంద్ర దర్శనం (నెలవంక) పైనే ఆధారపడి ఉంటాయి. ఈ సారి దుల్ హిజ్జా నెలవంక దర్శనం అనుకున్న సమయం కంటే ఒకరోజు ఆలస్యం అయింది. చంద్రదర్శనం ఆలస్యం కావడంతో పండుగను మే 27కు బదులుగా, ఒకరోజు తర్వాత అంటే మే 28వ తేదీన నిర్వహించుకోవాలని ముస్లిం మతపెద్దలు అధికారికంగా ప్రకటించారు.
మతపెద్దల సూచనల మేరకు తెలంగాణ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మైనారిటీ సంక్షేమ శాఖల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సిఫార్సులను పరిశీలించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం శనివారం నాడు సెలవు మార్పు ఉత్తర్వులను జారీ చేసింది.
మే 28న స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులు బంద్
నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 (N.I. Act) ప్రకారం మే 28వ తేదీని సాధారణ సెలవు దినంగా (General Holiday) ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం మే 28న (గురువారం) రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు (స్కూళ్లు, కాలేజీలు) మరియు బ్యాంకులు మూతపడనున్నాయి.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లోని నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా రెండు రోజుల క్రితమే ముస్లిం మతపెద్దల ప్రకటన ఆధారంగా బక్రీద్ సెలవును మే 28కి మారుస్తూ జీవో జారీ చేసింది. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ మే 28వ తేదీనే అధికారికంగా బక్రీద్ పండుగ వేడుకలు, సెలవులు ఉండనున్నాయి.




