Mahabubnagar: జబర్దస్త్ ‘కొమురక్క’పై దాడి.. అభిమానులమని నమ్మించి దారుణం..

Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లాలో జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై దారుణమైన దాడి జరిగింది.

Arun Chilukuri
Published on: 2 April 2026 10:50 AM IST
Mahabubnagar
X

Mahabubnagar: జబర్దస్త్ ‘కొమురక్క’పై దాడి.. అభిమానులమని నమ్మించి దారుణం..

Mahabubnagar: జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలోని ఆమె స్వగ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అభిమానులమని నమ్మించి వచ్చిన ఎనిమిది మంది యువకులు కొమురక్కపై, ఆమె కుటుంబ సభ్యులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. కొమురక్క ఇంట్లో గతంలో కొంత బంగారం చోరీకి గురైంది. తన అసిస్టెంట్ శ్రీనాథ్‌పై అనుమానంతో కొమురక్క అతడిని నిలదీయగా, తానే దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. అయితే, రెండు రోజుల క్రితం బంగారం తిరిగి ఇవ్వాలని కొమురక్క అతడిని మందలించడంతో, శ్రీనాథ్ తన స్నేహితులకు ఈ విషయం చెప్పాడు.

మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీనాథ్ స్నేహితులు వంశీకృష్ణ, వికాస్, చంద్రశేఖర్ సహా ఎనిమిది మంది యువకులు కొమురక్క ఇంటికి చేరుకున్నారు. తాము అభిమానులమని, ఫొటో దిగాలని నమ్మబలికారు. తీరా లోపలికి వెళ్లాక, "మా స్నేహితుడు శ్రీనాథ్‌ను ఎందుకు తిట్టావు?" అంటూ వాగ్వాదానికి దిగారు.

ఈ క్రమంలో నిందితులు రాయితో దాడి చేయబోగా, కొమురక్క సోదరుడు యాదయ్య అడ్డుపడ్డారు. నిందితులు విచక్షణారహితంగా కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో కొమురక్క కుడి చేతికి గాయమైంది. అడ్డువచ్చిన స్థానికుడు రాముపై కూడా దాడి చేసి, చంపేస్తామని బెదిరించారు.

స్థానికులు చుట్టుముట్టడంతో నిందితులు తమ బైక్‌లను అక్కడే వదిలేసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వంశీకృష్ణ, వికాస్, చంద్రశేఖర్, గోవా శివ, రామ్‌చరణ్, నరేష్, పోతుల శివ, కిశోర్‌లను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story