Xiaomi: భారత మార్కెట్లోకి షావోమీ సరికొత్త 'మినీ ఎల్‌ఈడీ' స్మార్ట్ టీవీ.. ధర, ఫీచర్లు ఇవే..?

Xiaomi Mini LED TV India Launch: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షావోమీ, భారతీయ వినియోగదారులకు సరికొత్త టీవీ అనుభూతిని పంచేందుకు సిద్ధమైంది.

Venkat
Published on: 1 April 2026 2:10 PM IST
Xiaomi
X

Xiaomi: భారత మార్కెట్లోకి షావోమీ సరికొత్త 'మినీ ఎల్‌ఈడీ' స్మార్ట్ టీవీ.. ధర, ఫీచర్లు ఇవే..?

Xiaomi Mini LED TV India Launch: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షావోమీ, భారతీయ వినియోగదారులకు సరికొత్త టీవీ అనుభూతిని పంచేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 15న తన మొట్టమొదటి 'మినీ ఎల్‌ఈడీ' స్మార్ట్ టీవీ సిరీస్‌ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Xiaomi Mini LED TV India Launch: స్మార్ట్‌ఫోన్ రంగంలో అగ్రగామిగా ఉన్న షావోమీ, ఇప్పుడు తన దృష్టిని గృహోపకరణాల విభాగంపై మళ్లించింది. ఇందులో భాగంగానే 'షావోమీ టీవీ ఎస్ మినీ ఎల్‌ఈడీ' సిరీస్‌ను తీసుకువస్తోంది. సాధారణ ఎల్‌ఈడీ టీవీల కంటే మెరుగైన కలర్స్, అత్యున్నతమైన బ్రైట్ నెస్ అందించే మినీ ఎల్‌ఈడీ సాంకేతికతను ఇందులో వాడారు. దీనికి సంబంధించి ఇప్పటికే కంపెనీ ఒక ప్రత్యేక వెబ్‌సైట్ పేజీని కూడా అందుబాటులోకి తెచ్చింది.

అద్భుతమైన పిచ్చర్ క్వాలిటీ..

ఈ టీవీ సిరీస్‌లో షావోమీ సొంత 'క్వాంటం మ్యాజిక్ డిస్‌ప్లే' సాంకేతికతను ఉపయోగించింది. ఇది 4K స్పష్టతతోపాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. దీనివల్ల క్రీడలు చూసేటప్పుడు లేదా గేమ్స్ ఆడేటప్పుడు ఎంతో క్వాలిటీతో కనిపిస్తాయి. 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వల్ల పగటి పూట వెలుతురులో కూడా టీవీ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే హెచ్‌డీఆర్ 10 ప్లస్ (HDR10+) వంటి ఫీచర్లు సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తాయి.

సౌండ్ క్వాలిటీతోపాటు స్మార్ట్ ఫీచర్లు..

కేవలం పిచ్చర్ క్వాలిటీ కాకుండా, సౌండ్ విషయంలోనూ షావోమీ రాజీ పడలేదు. ఇందులో 15 వాట్ల సామర్థ్యం గల రెండు స్పీకర్లను అమర్చారు. ఇవి 'డాల్బీ అట్మాస్' (Dolby Atmos) సౌండ్‌కు మద్దతు ఇస్తాయి. దీనివల్ల ఇంటిలోనే థియేటర్ వంటి శబ్దం వినబడుతుంది. ఈ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి యాప్‌లను నేరుగా వాడుకోవచ్చు. క్రోమ్‌కాస్ట్ ద్వారా మొబైల్‌లోని సమాచారాన్ని టీవీ స్క్రీన్ పైనా సులభంగా మార్చుకోవచ్చు.

మరిన్ని ఫీచర్లు..

వై-ఫై 5, బ్లూటూత్ 5.0 వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. హెచ్‌డీఎంఐ 2.1 (HDMI 2.1) పోర్ట్ ఉండటం వల్ల గేమింగ్ ప్రియులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. అంతర్జాతీయంగా ఈ టీవీలు 55 నుంచి 98 అంగుళాల పరిమాణంలో లభ్యమవుతున్నాయి. అయితే, భారత్‌లో ప్రాథమికంగా 55, 65 అంగుళాల మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉంది.

షావోమీ గనుక ఈ టీవీని సరసమైన ధరకే అందిస్తే, ఇది స్మార్ట్ టీవీ మార్కెట్‌లో పెను మార్పులకు కారణం కావొచ్చు. ఏప్రిల్ 15న ధర, ఇతర వివరాలు పూర్తిగా వెల్లడి కానున్నాయి.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story