Smart TV Tips: కొత్త స్మార్ట్ టీవీ కొన్నారా.. వెంటనే ఇలా చేయండి.. లేదంటే డిస్‌ప్లే ఖతం..!
Smart TV Tips: మీరు కొత్తగా స్మార్ట్ టీవీని కొనుగోలు చేశారా? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి. చాలామంది టీవీకి ఉన్న ప్లాస్టిక్ పిల్మ్‌ను భద్రత కోసం అలాగే ఉంచుతారు.
Smart TV Tips: సాధారణంగా మనం ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు దానిపై ఉన్న ప్లాస్టిక్ కోటింగ్‌ను తీయడానికి ఇష్టపడం. అది ఉంటే వస్తువు కొత్తగా ఉంటుందని, గీతలు పడవని మన భావన. ముఖ్యంగా స్మార్ట్ టీవీల విషయంలో వినియోగదారులు ఇదే పొరపాటు చేస్తున్నారు. టీవీ ప్యానెల్ పైన ఉండే ప్రొటెక్టివ్ పిల్మ్‌ను అలాగే ఉంచి టీవీ చూస్తుంటారు. అయితే, ఈ అలవాటు వల్ల టీవీ మదర్‌బోర్డ్ కాలిపోయే ప్రమాదం ఉందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. శామ్సంగ్, ఎల్‌జీ వంటి దిగ్గజ కంపెనీలు కూడా టీవీని అన్‌బాక్స్ చేసిన వెంటనే ఈ ప్యాకింగ్ పన్నాని తొలగించాలని స్పష్టంగా సూచిస్తున్నాయి.
ఓవర్ హీటింగ్ సమస్య - మదర్‌బోర్డ్ దెబ్బతినే ఛాన్స్..
స్మార్ట్ టీవీలు పనిచేస్తున్నప్పుడు సహజంగానే కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ వేడిని బయటకు పంపడానికి టీవీ వెనుక లేదా పక్క భాగాల్లో చిన్న చిన్న వెంట్స్ (గాలి రంధ్రాలు) ఉంటాయి. కొత్త టీవీకి వచ్చే ప్లాస్టిక్ ప్యాకింగ్ ఈ వెంట్స్‌ను పూర్తిగా కప్పివేస్తుంది. దీనివల్ల లోపల ఉత్పత్తి అయ్యే వేడి బయటకు వెళ్లలేక టీవీ లోపల పేరుకుపోతుంది. ఫలితంగా సెన్సిటివ్ ఐసీలు (ICs), కెపాసిటర్లు, ముఖ్యంగా మదర్‌బోర్డ్ వేడెక్కి కాలిపోయే అవకాశం ఉంది. ఓవర్ హీటింగ్ వల్ల టీవీ పదేపదే రీస్టార్ట్ అవ్వడం లేదా అకస్మాత్తుగా ఆగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
స్క్రీన్ డిస్‌ప్లేకు శాశ్వత నష్టం..
ప్లాస్టిక్ పిల్మ్ తీయకపోవడం వల్ల కేవలం లోపలి భాగాలే కాదు, పైకి కనిపించే స్క్రీన్ కూడా పాడవుతుంది. ఈ ప్లాస్టిక్ కవర్ టీవీ స్క్రీన్‌కు అతుక్కుని ఉండటానికి ఒక రకమైన గమ్మును ఉపయోగిస్తారు. టీవీ వేడెక్కుతున్న కొద్దీ ఆ గమ్ము స్క్రీన్‌కు గట్టిగా అతుక్కుపోతుంది. కొంతకాలం తర్వాత మీరు ఆ ప్లాస్టిక్ తీయాలని ప్రయత్నిస్తే, స్క్రీన్‌పై జిగట మరకలు ఉండిపోతాయి. వాటిని శుభ్రం చేసే క్రమంలో డిస్‌ప్లేపై స్క్రాచ్‌లు పడటం లేదా స్క్రీన్ కోటింగ్ దెబ్బతినడం జరుగుతుంది. ఇది మీ టీవీ పిక్చర్ క్వాలిటీని పూర్తిగా తగ్గిస్తుంది.
రిమోట్ సెన్సార్లు, విజువల్ ఎక్స్‌పీరియన్స్..
ఆధునిక స్మార్ట్ టీవీలు 'ఆటో బ్రైట్‌నెస్' వంటి స్మార్ట్ ఫీచర్లతో వస్తాయి. వీటికి అవసరమైన సెన్సార్లు టీవీ బెజెల్స్ లేదా కింది భాగంలో ఉంటాయి. ప్లాస్టిక్ పిల్మ్ ఈ సెన్సార్లను కప్పి ఉంచడం వల్ల అవి సరిగ్గా పనిచేయవు. అలాగే, ఐఆర్ (IR) రిమోట్ సిగ్నల్స్‌ను కూడా ఈ ప్లాస్టిక్ అడ్డుకోవచ్చు, దీనివల్ల రిమోట్ సరిగ్గా పనిచేయదు. అంతేకాకుండా, ప్లాస్టిక్ పిల్మ్ వల్ల స్క్రీన్‌పై లైటింగ్ రిఫ్లెక్షన్ ఎక్కువగా ఉంటుంది, ఇది మీ టీవీ చూసే అనుభూతిని పాడు చేస్తుంది.
ఏం చేయాలి?
మీరు కొత్త టీవీ కొన్నప్పుడు దాన్ని బాక్స్ నుంచి తీయగానే, అన్ని వైపులా ఉన్న ప్రొటెక్టివ్ ప్లాస్టిక్ పిల్మ్‌ను జాగ్రత్తగా తొలగించండి. ఇది మీ టీవీకి గాలి ఆడేలా చేసి, వేడిని క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా మీ టీవీ సురక్షితంగా ఉండటమే కాకుండా ఎక్కువ కాలం మన్నుతుంది.




