WhatsApp: వాట్సాప్‌లో సరికొత్త విప్లవం.. ఇకపై యాప్ నుంచే నేరుగా మొబైల్ రీఛార్జ్..!

How to Recharge Mobile on WhatsApp: తమ వినియోగదారుల కోసం వాట్సప్ అధ్బుత ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా మొబైల్ రీఛార్జ్ లను కూడా ప్రవేశపెట్టింది.

Venkat
Published on: 24 April 2026 12:00 PM IST
WhatsApp
X

WhatsApp

WhatsApp Mobile Recharge India: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన భారతీయ వినియోగదారుల కోసం మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై వేరే ఇతర యాప్‌ల అవసరం లేకుండానే, నేరుగా వాట్సాప్ ద్వారానే మీ మొబైల్ రీఛార్జ్ పనులను పూర్తి చేసుకోవచ్చు. మెటా సంస్థ నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ చెల్లింపుల సంస్థతో చేతులు కలిపి ఈ సేవలను ప్రవేశపెట్టింది.

వాట్సాప్ కొత్త మొబైల్ రీఛార్జ్ సౌకర్యం..

భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసే దిశగా వాట్సాప్ అడుగులు వేస్తోంది. తాజాగా ప్రకటించిన ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ ప్లాన్లను వెతుక్కోవడం, రీఛార్జ్ చేయడం వంటి పనులను క్షణాల్లో పూర్తి చేయవచ్చు. ఇందుకోసం వాట్సాప్ 'పే-యు' అనే అంతర్జాతీయ చెల్లింపుల సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సౌకర్యం ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులందరికీ రానున్న వారాల్లో దశలవారీగా అందుబాటులోకి రానుంది.

ముఖ్యంగా ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన నెట్‌వర్క్ వినియోగదారులు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. వినియోగదారులు తమకు నచ్చిన ప్లాన్లను ఎంచుకోవడానికి యాప్ నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మెట్రో టిక్కెట్లు, విద్యుత్ బిల్లుల వంటి సేవలను అందిస్తున్న వాట్సాప్, ఇప్పుడు ఈ రీఛార్జ్ ఫీచర్‌తో మరింత చేరువ కానుంది.

కొత్త రూపాయి గుర్తుతో సులభమైన యాక్సెస్..

వినియోగదారుల సౌకర్యార్థం వాట్సాప్ తన హోమ్ స్క్రీన్‌పై కెమెరా గుర్తు పక్కనే ఒక ప్రత్యేకమైన రూపాయి (₹) గుర్తును చేర్చింది. ఈ గుర్తును నొక్కడం ద్వారా నేరుగా చెల్లింపుల విభాగంలోకి ప్రవేశించవచ్చు. అక్కడ మొబైల్ రీఛార్జ్‌తో పాటు యూపీఐ ద్వారా నగదు బదిలీ చేసే అవకాశం కూడా ఉంటుంది. వ్యక్తిగత చాట్‌లలో కూడా ఈ గుర్తు అందుబాటులో ఉండటం వల్ల సందేశాలు పంపిస్తూనే చెల్లింపులు పూర్తి చేయవచ్చు.

వాట్సాప్‌లో రీఛార్జ్ చేసుకునే విధానం..

వాట్సాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం ఎలాగో ఓసారి చూద్దాం..

ముందుగా మీ వాట్సాప్ హోమ్ స్క్రీన్‌పై ఉన్న రూపాయి (₹) గుర్తును నొక్కండి.

అందులో కనిపించే మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ అనే విభాగాన్ని ఎంచుకోండి.

మీ నంబర్‌ను లేదా మీరు రీఛార్జ్ చేయాలనుకుంటున్న ఇతర నంబర్‌ను నమోదు చేయండి.

మీ సిమ్ ఏ నెట్‌వర్క్ సంస్థకు చెందినదో ఒకసారి సరిచూసుకోండి.

తర్వాత మీ మొబైల్ ఆపరేటర్ అందిస్తున్న వివిధ ప్లాన్ల నుంచి మీకు నచ్చిన దానిని ఎంచుకోండి.

చెల్లింపు కోసం యూపీఐ, డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు వంటి మార్గాలలో ఒకదానిని ఎంచుకుని ప్రక్రియను పూర్తి చేయండి.

యూపీఐ వినియోగదారులు తమ పిన్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా లావాదేవీని పూర్తి చేయవచ్చు. రీఛార్జ్ విజయవంతం అయిన తర్వాత దానికి సంబంధించిన వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story