వేడికి చెక్.. ‘వేరబుల్ ఏసీ’ వచ్చేసిందిగా.. ఇక ఎండల్లోనూ జాలీగా తిరిగొచ్చు..!

Reon Pocket Pro Plus: రోహిణి కార్తె ఎండలు, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్న ఈ రోజుల్లో.. ఏసీని వెంట పట్టుకుని తిరగలేం కదా అనే కొరతను సోనీ తీర్చేసింది.

Venkat
Published on: 27 May 2026 9:48 AM IST
Reon Pocket Pro Plus
X

వేడికి చెక్.. ‘వేరబుల్ ఏసీ’ వచ్చేసిందిగా.. ఇక ఎండల్లోనూ జాలీగా తిరిగొచ్చు..!

Sony wearable AC: మండుటెండల్లో రోడ్డుపై నడుస్తున్నప్పుడు చెమట చుక్క కూడా పట్టకుండా, ఏసీ గదిలో ఉన్నట్లు హాయిగా ఉంటే ఎలా ఉంటుంది? ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో సీన్ అనుకుంటే పొరపాటే! ప్రముఖ టెక్ దిగ్గజం సోనీ సరికొత్త ‘వేరబుల్ ఏసీ’ని పరిచయం చేసింది. బట్టల లోపల అమర్చుకునే ఈ చిన్న పరికరం 10 గంటల పాటు ఒంటికి చల్లదనాన్ని అందిస్తుంది.

కళ్లముందే అద్భుతం: మాడు పగిలే ఎండల్లోనూ కశ్మీర్ చలి..!

రోహిణి కార్తె ఎండలు, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్న ఈ రోజుల్లో.. ఏసీని వెంట పట్టుకుని తిరగలేం కదా అనే కొరతను సోనీ తీర్చేసింది. సరికొత్త సాంకేతికతతో Sony Reon Pocket Pro Plus పేరుతో ఒక పోర్టబుల్ ఎయిర్ కండిషనర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది మీ షర్టు లోపల దాగి ఉంటూ, బయట ఎంత ఎండ ఉన్నా సరే, శరీరాన్ని షిమ్లా, కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో ఉన్నట్లుగా చల్లబరుస్తుంది. కేవలం ఎండాకాలంలో చల్లదనం ఇవ్వడమే కాదు, శీతాకాలంలో ఒంటిని వెచ్చగా ఉంచడం కూడా దీని ప్రత్యేకత.

ఈ చిన్న ఏసీ ఎలా పనిచేస్తుందంటే?

చూడటానికి ఎంతో కాంపాక్ట్‌గా, స్టైలిష్‌గా ఉండే ఈ పరికరంలో ఒక ఫ్లెక్సిబుల్ నెక్ బ్యాండ్ ఉంటుంది. దీన్ని మెడకు తగిలించుకుంటే, దీనికున్న స్టెయిన్‌లెస్ స్టీల్ కూలింగ్ ప్లేట్ మీ మెడ వెనుక భాగాన్ని తాకుతూ ఉంటుంది. సోనీ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. మునుపటి మోడల్స్ కంటే ఇది 20% మెరుగ్గా పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను ఏకంగా 2 డిగ్రీల వరకు తగ్గించగలదు. కూలింగ్ ప్లేట్ మెడ వెనుక భాగంలో ఉన్నప్పటికీ, దీని ద్వారా వచ్చే చల్లదనం క్షణాల్లో శరీరం అంతటా వ్యాపించి పూర్తి ఉపశమనాన్ని ఇస్తుంది.

శరీర తత్వాన్ని బట్టి కూలింగ్ మార్చేసే ‘స్మార్ట్’ సెన్సార్లు..

ఈ పోర్టబుల్ ఏసీ కేవలం గాలిని మాత్రమే విసరదు, దీని వెనుక అధునాతన సాంకేతికత ఉంది. ఇందులో అమర్చిన హై-టెక్ సెన్సార్లు మీ శరీర ఉష్ణోగ్రతను నిరంతరం గమనిస్తూ ఉంటాయి. దీనితో పాటు లభించే సెకండ్ జనరేషన్ పాకెట్ ట్యాగ్‌ను మీ బెల్ట్‌కు లేదా బ్యాగ్‌కు తగిలించుకోవచ్చు. ఈ ట్యాగ్ బయటి వాతావరణంలోని వేడిని, తేమను (హ్యుమిడిటీ) లెక్కగట్టి, ఆ సమాచారాన్ని ఏసీ పరికరానికి అందిస్తుంది. వాతావరణానికి అనుగుణంగా ఇది కూలింగ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటుంది.

ఒక్కసారి చార్జ్ చేస్తే 10 గంటల బ్యాకప్!

బ్యాటరీ పరంగా కూడా సోనీ ఎక్కడా తగ్గలేదు. ఈ చిన్న ఏసీని ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఏకధాటిగా 10 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. అంటే ఆఫీస్ పనుల మీద బయటకు వెళ్లేవారు లేదా ప్రయాణాలు చేసేవారికి రోజంతా చల్లటి రక్షణ లభిస్తుంది.

ధర ఎంత? మన దేశంలోకి ఎప్పుడు వస్తుంది?

ఈ వినూత్నమైన డివైజ్‌ను ప్రస్తుతం యూకే, యూరప్ మార్కెట్లలో సోనీ విడుదల చేసింది. బ్రిటన్‌లో దీని ధర దాదాపు £199 (భారత కరెన్సీలో సుమారు రూ. 25,578) కాగా, యూరప్‌లో €229 (సుమారు రూ. 25,409) గా నిర్ణయించారు. భారత మార్కెట్లోకి ఇది ఎప్పుడు అధికారికంగా అడుగుపెడుతుందనే విషయాలపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే ఇక్కడి ఎండల తీవ్రత దృష్ట్యా, త్వరలోనే దేశీయ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సాంకేతిక ప్రపంచంలో ఇదొక విప్లవాత్మక ఆవిష్కరణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గదికే పరిమితమైన ఎయిర్ కండిషనర్ టెక్నాలజీని, మనుషులు ధరించేలా మార్చడం ద్వారా సోనీ భవిష్యత్తు జీవనశైలికి బాటలు వేసింది. రాబోయే రోజుల్లో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఈ వేరబుల్ ఏసీలు సామాన్యులకు సైతం ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story