Smartphone: కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? కాస్త ఆగండి భారీగా ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం

Smartphone: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి త్వరలో శుభవార్త వచ్చే అవకాశం ఉంది.

Mokshith
Published on: 2 July 2026 12:26 PM IST
Smartphone
X

Smartphone: కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? కాస్త ఆగండి భారీగా ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం

Smartphone: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి త్వరలో శుభవార్త వచ్చే అవకాశం ఉంది. రూ.25,000లోపు ధర ఉన్న స్మార్ట్‌ఫోన్లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఇలా చేస్తే దేశంలో కోట్లాది మంది తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే అవకాశం ల‌భించ‌నుంది.

రూ.25 వేల లోపు ఫోన్లపై జీఎస్‌టీ తగ్గించాలని ప్రతిపాదన

ఈ ప్రతిపాదనను గ్రాంట్ థార్న్టన్ భారత్ (GT Bharat), పాలసీ వాచ్ ఇండియా ఫౌండేషన్ (PWIF) సంయుక్తంగా రూపొందించిన నివేదికలో సూచించారు. నివేదిక ప్రకారం రూ.25,000 వరకు ధర ఉన్న స్మార్ట్‌ఫోన్లపై జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలి. అయితే రూ.25 వేల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం ఫోన్లపై ప్రస్తుతం అమల్లో ఉన్న 18 శాతం జీఎస్‌టీని యథాతథంగా కొనసాగించవచ్చు అని సూచించింది. ఇలా చేస్తే మొదటిసారి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు, విద్యార్థులు వంటి వర్గాలకు మంచి ప్రయోజనం ఉంటుందని నివేదిక పేర్కొంది.

ఎందుకు తగ్గించాలనే సూచన వచ్చింది?

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ అనేది కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు. బ్యాంకింగ్, ఆన్‌లైన్ విద్య, ప్రభుత్వ సేవలు, డిజిటల్ చెల్లింపులు, ఆరోగ్య సేవలు, ఉద్యోగ అవకాశాలు వంటి అనేక అవసరాలకు ఇది ప్రధాన సాధనంగా మారింది. అయితే తక్కువ ధర ఫోన్లపై కూడా ప్రీమియం ఫోన్లతో సమానంగా 18 శాతం జీఎస్‌టీ ఉండటం వల్ల సామాన్యులకు అదనపు భారం పడుతోందని నివేదిక పేర్కొంది. అందుకే అందుబాటు ధరలో ఉన్న ఫోన్లకు ప్రత్యేక జీఎస్‌టీ విధానం అవసరమని సూచించింది.

ఈ నిర్ణయం వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనం?

అధ్యయనం ప్రకారం భారత్‌లో విక్రయమవుతున్న స్మార్ట్‌ఫోన్లలో దాదాపు మూడింట రెండు వంతులు రూ.25,000లోపు ధర కలిగినవే. ఈ విభాగాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు మొదటిసారి స్మార్ట్‌ఫోన్ కొనేవారు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు, మహిళలు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు. ఇంకా దేశంలో దాదాపు 35 కోట్ల మంది ఇప్పటికీ ఫీచర్ ఫోన్లనే ఉపయోగిస్తున్నారు. ధరలు తగ్గితే వీరిలో చాలామంది స్మార్ట్‌ఫోన్‌లకు మారే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది?

నివేదిక ప్రకారం వియత్నాం, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలు స్మార్ట్‌ఫోన్లపై తక్కువ పన్ను విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో అక్కడ మొబైల్ తయారీ పరిశ్రమ పోటీ సామర్థ్యాన్ని పెంచుకోవడమే కాకుండా, ఎక్కువ మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించే పరిస్థితి ఏర్పడింది. ఈ అనుభవాన్ని భారత్ కూడా పరిశీలించాలని అధ్యయనం సూచించింది.

ప్రభుత్వం అమలు చేస్తే ఏమవుతుంది?

ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే రూ.25 వేలలోపు ధర ఉన్న స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. దీంతో కోట్లాది మంది కొత్త స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేయగలరు. అలాగే డిజిటల్ ఇండియా, ఆన్‌లైన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, ఈ-గవర్నెన్స్ సేవలు మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి కూడా ఇది ఊతమివ్వడంతో పాటు, దేశంలో డిజిటల్ వినియోగాన్ని మరింత పెంచే కీలక నిర్ణయంగా మారే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story