చాట్ జీపీటీ యూజర్లకు బిగ్ అలర్ట్.. మే 8 లోపు ఇలా చేయకపోతే పనిచేయదంతే..!
OpenAI Security Alert: మీరు యాపిల్ కంప్యూటర్ లేదా లాప్‌టాప్‌లో చాట్‌జీపీటీ ఉపయోగిస్తున్నారా? అయితే ఈ హెచ్చరిక మీ కోసమే. మే 8, 2026 లోపు ఇలా చేయకపోతే పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది.
చాట్ జీపీటీ యూజర్లకు బిగ్ అలర్ట్.. మే 8 లోపు ఇలా చేయకపోతే పనిచేయదంతే..!
OpenAI Security Alert: సాంకేతిక ప్రపంచంలో పెను మార్పులు తీసుకొచ్చిన చాట్‌జీపీటీ ఇప్పుడు తన రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకుంటోంది. ముఖ్యంగా మ్యాక్ ఓఎస్ (macOS) వినియోగదారులు మే 8 లోపు చాట్ జీపీటీ డెస్క్‌టాప్, కోడెక్స్, అట్లాస్ వంటి అన్ని అప్లికేషన్లను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత పాత వెర్షన్లు పనిచేయవని కంపెనీ వెల్లడించింది.
అసలు అప్‌డేట్ ఎందుకు అవసరమైంది?
ఈ ఆకస్మిక నిర్ణయానికి ప్రధాన కారణం ఒక భద్రతా లోపం. యాక్సియోస్ (Axios) జావాస్క్రిప్ట్ లైబ్రరీలో హ్యాకర్లు చొరబడినట్లు గుర్తించారు. ఒక హ్యాకర్ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఈ లైబ్రరీలోకి ప్రవేశించి, అందులోని కొన్ని వెర్షన్లలో ప్రమాదకరమైన 'ట్రోజన్' వైరస్‌ను ప్రవేశపెట్టారు. దీనివల్ల కంప్యూటర్లను రిమోట్ ద్వారా నియంత్రించే ప్రమాదం ఉంటుంది. అయితే, వినియోగదారుల డేటా లేదా సంస్థ రహస్య కోడ్ ఏదీ దొంగిలించబడలేదని ఓపెన్ ఏఐ భరోసా ఇచ్చింది. అయినప్పటికీ, భవిష్యత్తులో ఎటువంటి ముప్పు రాకుండా ఉండటానికే ఈ చర్యలు చేపట్టింది.
కోడ్-సైనింగ్ సర్టిఫికేట్ మార్పు..
మ్యాక్ డివైజ్ ల్లోని ప్రతి యాప్ విశ్వసనీయతను తనిఖీ చేయడానికి ఒక కోడ్ సైనింగ్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇది ఆ యాప్ అసలైన డెవలపర్ నుంచి వచ్చిందని నిర్ధారిస్తుంది. ప్రస్తుత భద్రతా కారణాల వల్ల ఓపెన్ ఏఐ తన సర్టిఫికేట్‌ను మార్చాలని నిర్ణయించుకుంది. పాత సర్టిఫికేట్ కలిగిన యాప్‌లను క్రమంగా నిరోధించడం వల్ల, వినియోగదారులు కొత్త వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం అనివార్యమైంది.
ఎవరిపై ఈ ప్రభావం ఉంటుంది?
ఈ మార్పు కేవలం మ్యాక్ కంప్యూటర్లను ఉపయోగించే వారికి మాత్రమే వర్తిస్తుంది. మీరు ఐఫోన్ (iOS), ఆండ్రాయిడ్ లేదా విండోస్ పరికరాల్లో చాట్‌జీపీటీ వాడుతుంటే ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం మ్యాక్ డెస్క్‌టాప్ యాప్‌లకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.
వినియోగదారులు ఏమి చేయాలి?
వినియోగదారులు వెంటనే ఓపెన్ ఏఐ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ స్టోర్‌లోకి వెళ్లి తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని కోసం పాస్‌వర్డ్‌లు మార్చాల్సిన లేదా ఏపీఐ కీలను రీసెట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం అప్లికేషన్ అప్‌డేట్ చేస్తే సరిపోతుంది. 2026 మే 8 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయడం వల్ల ఎటువంటి అంతరాయం లేకుండా సేవలను పొందవచ్చు.




