Artemis 2: 54 ఏళ్ల తర్వాత చంద్రుడిని చుట్టొచ్చిన వ్యోమగాములు

Artemis 2: చంద్రుడి చుట్టూ 10 రోజుల సుదీర్ఘ ప్రయాణం ముగించుకుని భూమిపైకి సురక్షితంగా చేరిన ఆర్టెమిస్-2 వ్యోమగాములు.

Naresh.k
Published on: 11 April 2026 8:05 AM IST
Artemis 2
X

Artemis 2: 54 ఏళ్ల తర్వాత చంద్రుడిని చుట్టొచ్చిన వ్యోమగాములు

NASA Moon Mission: అరవై ఏళ్ల కల.. పదేళ్ల కష్టం.. 10 రోజుల ఉత్కంఠభరిత ప్రయాణం. మానవ అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ, చంద్రుడి చుట్టూ ప్రయాణించిన ఆర్టెమిస్-2 వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. 1972 తర్వాత మళ్ళీ అంత దూరం వెళ్లి, మృత్యుంజయులై తిరిగి వచ్చిన ఈ నలుగురు యోధుల రాకతో ప్రపంచం ఒక్కసారిగా హర్షధ్వానాలతో మార్మోగిపోయింది.

సముద్ర గర్భంలో ఓరియన్ పలకరింపు

భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 5:37 గంటలకు పసిఫిక్ మహాసముద్రం ఒక అద్భుత దృశ్యానికి సాక్ష్యమైంది. గంటకు 24,000 మైళ్ల భీకర వేగంతో భూ వాతావరణంలోకి దూసుకొచ్చిన 'ఓరియన్' క్యాప్సూల్, నిప్పులు చిమ్ముతూ ఆకాశం నుండి జారిపడింది. పారాచూట్లు విచ్చుకుని నెమ్మదిగా సాన్ డియాగో తీర సమీపంలో సముద్రపు అలలపై వాలగానే నాసా మిషన్ కంట్రోల్ సెంటర్‌లో శాస్త్రవేత్తల కళ్లు ఆనందబాష్పాలతో నిండాయి.

కొత్త మైలురాయిని

అపోలో మిషన్ల కంటే అత్యధిక దూరం ప్రయాణించి అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిని నిర్మించారు.చంద్రుడి అవతలి వైపును అత్యంత దగ్గరగా చూడటమే కాకుండా, అంతరిక్షం నుండి చంద్రుడిపై ఏర్పడిన సూర్యగ్రహణాన్ని వీక్షించే అద్భుత అవకాశం వీరికి దక్కింది.భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఏర్పడిన విపరీతమైన ఉష్ణోగ్రతను ఓరియన్ హీట్ షీల్డ్ సమర్థవంతంగా తట్టుకుని, వ్యోమగాములను రక్షించింది.

ఆ నలుగురు..

కమాండర్ రీడ్ వైజ్‌మ్యాన్ నాయకత్వంలో విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్ మరియు జెరెమీ హాన్సెన్ ఈ 10 రోజుల పాటు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. మేము సురక్షితంగా ఉన్నాం.. భూమిపైకి రావడం ఆనందంగా ఉంది అని వైజ్‌మ్యాన్ ప్రకటించగానే ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమ్ చూస్తున్న లక్షలాది మంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం వీరు USS John P. Murtha నౌకలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

ఆర్టెమిస్-2 విజయం కేవలం ఒక ప్రయాణం ముగింపు కాదు, ఇది ఆర్టెమిస్-3కి పునాది. తదుపరి మిషన్‌లో మానవులను నేరుగా చంద్రుడి ఉపరితలంపై దించి, అక్కడ శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసే దిశగా నాసా అడుగులు వేస్తోంది. 54 ఏళ్ల విరామం తర్వాత మానవుడు మళ్ళీ జాబిల్లిపై అడుగుపెట్టే రోజు ఎంతో దూరంలో లేదని ఈ మిషన్ నిరూపించింది.

Naresh.k

Naresh.k

Next Story