Meta Smart Glasses : స్మార్ట్ గ్లాసెస్ వాడేవారికి మెటా షాక్.. కెమెరా లైట్ మూసేస్తే ఇక పని చేయదు.!
Meta Smart Glasses : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో కూడిన స్మార్ట్ గ్లాసెస్ (Smart Glasses) వాడకం ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారత్‌లోనూ క్రమంగా..
meta-smart-glasses
Meta Smart Glasses : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో కూడిన స్మార్ట్ గ్లాసెస్ (Smart Glasses) వాడకం ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారత్‌లోనూ క్రమంగా పెరుగుతోంది. అయితే, ఈ కళ్లద్దాల్లో ఉండే కెమెరాల వల్ల ఇతరుల ప్రైవసీకి భంగం కలుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా మొబైల్‌తో రికార్డ్ చేస్తే సులభంగా కనిపెట్టవచ్చు కానీ, కళ్లద్దాలతో రికార్డ్ చేస్తే గుర్తించడం కష్టం. దీనిని అరికట్టేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం 'మెటా' (Meta) తన స్మార్ట్ గ్లాసెస్‌లో అత్యంత కఠినమైన ప్రైవసీ అప్‌డేట్‌ను తీసుకువచ్చింది.
కొత్త ప్రైవసీ రూల్ ఏంటి.?
మెటా సంస్థ తయారుచేసే ప్రతి ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ముందు భాగంలో ఒక చిన్న తెల్లటి 'క్యాప్చర్ ఎల్‌ఈడీ' (Capture LED) లైట్ ఉంటుంది. గ్లాసెస్ ద్వారా ఏదైనా ఫోటో తీసినప్పుడు లేదా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ లైట్ నిరంతరాయంగా వెలుగుతూ (Blink) ఉంటుంది. తద్వారా అవతలి వ్యక్తిని తాము రికార్డ్ చేస్తున్నామనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. తాజా అప్‌డేట్ ప్రకారం.. ఈ తెల్లటి ఎల్‌ఈడీ లైట్‌ను ఎవరైనా స్టిక్కర్లతో మూసివేసినా, దెబ్బతీసినా లేదా భౌతికంగా మార్చడానికి ప్రయత్నించినా.. ఆ గ్లాసెస్‌లోని కెమెరా ఆటోమేటిక్‌గా పని చేయడం ఆగిపోతుంది.
ఈ అప్‌డేట్ ఎందుకు అవసరమైంది.?
ఇటీవలి కాలంలో స్మార్ట్ గ్లాసెస్ ప్రైవసీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు వినియోగదారులు ఇతరులకు తెలియకుండా రికార్డ్ చేయడం కోసం.. గ్లాసెస్‌పై ఉండే ఈ ప్రైవసీ లైట్‌ను కవర్ చేసే స్టిక్కర్లను వాడుతున్నారు. అంతేకాకుండా, ఆన్‌లైన్ మార్కెట్లలో ఈ లైట్‌ను పూర్తిగా తొలగించే లేదా డిసేబుల్ చేసే సర్వీసులు కూడా దర్శనమిస్తున్నాయి. ఇలాంటి అక్రమ పద్ధతులకు అడ్డుకట్ట వేయడానికి , ఇతరుల వ్యక్తిగత భద్రతను కాపాడటానికి మెటా ఈ నిర్ణయం తీసుకుంది.
అక్రమ సర్వీసులపై మెటా సీరియస్
కేవలం గ్లాసెస్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడమే కాకుండా, ఈ లైట్‌ను ట్యాంపర్ (Tamper) చేసేలా ప్రోత్సహించే సర్వీసులు, ప్రకటనలు , 'ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్' లిస్టింగ్‌లను పూర్తిగా తొలగిస్తామని మెటా స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారి అకౌంట్లను బ్యాన్ చేయడంతో పాటు వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ కొత్త ప్రైవసీ అప్‌డేట్ ప్రస్తుతం మెటా సెకండ్ జనరేషన్ (2nd Gen) స్మార్ట్ గ్లాసెస్ వాడుతున్న వారందరికీ తప్పనిసరి చేయబడింది. ఈ అప్‌డేట్ వల్ల ప్రైవసీ ఆందోళనలు పూర్తిగా తొలగిపోకపోయినా.. ప్రైవసీ లైట్ పాడైతే కెమెరా కూడా ఆగిపోతుందనే స్పష్టమైన సందేశాన్ని మెటా వినియోగదారులకు పంపింది.




