Meta AI Privacy Scandal: మెటా స్మార్ట్ కళ్లజోళ్లుపై షాకిచ్చిన మాజీ ఉద్యోగి
Meta AI Privacy Scandal: మెటా సంస్థ రూపొందించిన స్మార్ట్ కళ్ళజోళ్ల ద్వారా వినియోగదారుల అత్యంత వ్యక్తిగత క్షణాలు రికార్డ్ అవుతున్నాయన్న వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Meta AI Privacy Scandal: మెటా స్మార్ట్ కళ్లజోళ్లుపై షాకిచ్చిన మాజీ ఉద్యోగి
Meta AI Privacy Scandal: ప్రముఖ సాంకేతిక దిగ్గజం మెటా స్మార్ట్ గ్లాసెస్ వినియోగదారుల ప్రైవసీని ప్రమాదంలో పడేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం సాధారణ సమాచారం సేకరించడమే కాకుండా, వినియోగదారుల అత్యంత రహస్య వీడియోలను కూడా కంపెనీ ఉద్యోగులు వీక్షిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఏఐ వ్యవస్థలకు శిక్షణ ఇచ్చే క్రమంలో భాగంగా, వేల సంఖ్యలో ఫోటోలు, వీడియోలను పరిశీలించే ఉద్యోగులు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు.
బెడ్‌రూమ్ నుంచి టాయిలెట్ వరకు.. అన్నీ రికార్డ్..!
ఒక నివేదిక ప్రకారం, ఒక మహిళ తన బెడ్‌రూమ్‌లో బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఆమె ధరించిన స్మార్ట్ గ్లాసెస్ రికార్డింగ్ మోడ్‌లో ఉన్నాయి. ఆ దృశ్యాలు నేరుగా ఏఐ శిక్షణ నిపుణులకు చేరాయి. "మేము ప్రజల లివింగ్ రూమ్ నుంచి వారి ప్రైవేట్ క్షణాల వరకు ప్రతిదీ చూస్తున్నాం" అని ఒక మాజీ ఉద్యోగి వాపోయారు. కొందరు వ్యక్తులు టాయిలెట్ ఉపయోగిస్తున్నప్పుడు లేదా శృంగార కార్యకలాపాలలో పాల్గొంటున్నప్పుడు తీసిన వీడియోలు కూడా ఈ డేటాలో భాగమైనట్లు సమాచారం.
మెటా, సామా మధ్య చెలరేగిన వివాదం..
ఈ భద్రతా వైఫల్యాలు బయటపడిన తర్వాత, మెటా తన అవుట్‌సోర్సింగ్ భాగస్వామి 'సామా'తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీనివల్ల దాదాపు పదకొండు వందల మందికి పైగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కంపెనీ నిబంధనలను పాటించలేదన్న నెపంతో మెటా ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, అసలు వాస్తవాలను బయటపెట్టినందుకే తమను తొలగించారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. నోరు విప్పిన వారిని శిక్షించడమే కాకుండా, నిశ్శబ్దంగా ఉంచేందుకే ఈ సామూహిక తొలగింపులు జరిగాయని ఆఫ్రికా టెక్ వర్కర్స్ మూవ్‌మెంట్ ప్రతినిధులు పేర్కొన్నారు.
సంస్థ వివరణ, విచారణ..
ఈ వ్యవహారంపై మెటా స్పందిస్తూ, ఏఐ వ్యవస్థలను మెరుగుపరచడానికి మానవ సమీక్ష సాధారణమేనని, ఇందుకు వినియోగదారుల అనుమతి ఉంటుందని పేర్కొంది. అయితే, బ్రిటన్, కెన్యా వంటి దేశాల డేటా రక్షణ సంస్థలు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాయి. ఇప్పటికే యూకే ఇన్ఫర్మేషన్ కమిషనర్ కార్యాలయం ఈ విషయాన్ని "ఆందోళనకరం"గా అభివర్ణించింది. మెటా నుంచి వివరణ కోరింది. ఏఐ పరిశ్రమలో పని తీరు, నైతికతపై ఈ వివాదం అనేక కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.




