మెటాకు కేంద్రం వార్నింగ్.. అలాంటి వీడియోలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
Meta: డీప్‌ఫేక్ వీడియోలు, చిన్నారులపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్ (CSAM).
మెటాకు కేంద్రం వార్నింగ్.. అలాంటి వీడియోలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
Meta: డీప్‌ఫేక్ వీడియోలు, చిన్నారులపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్ (CSAM), గుర్తింపు లేకుండా రూపొందిస్తున్న కృత్రిమ (సింథటిక్) కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ)పై మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ తరహా కంటెంట్‌ను వెంటనే నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం మెటాను ఆదేశించింది.
మెటాతో వరుసగా సమావేశాలు నిర్వహించిన కేంద్రం
ఇటీవల కేంద్ర ప్రభుత్వం మెటా ప్రతినిధులతో వరుసగా సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ పాల్గొన్నారు. మెటా తరఫున గ్లోబల్ అఫైర్స్ హెడ్ జోయెల్ కప్లాన్ నేతృత్వంలోని బృందం హాజరైంది. ముఖ్యంగా డీప్‌ఫేక్ వీడియోలు, చిన్నారులకు హానికరమైన కంటెంట్, బాట్ అకౌంట్లు, అలాగే కంటెంట్ సిఫార్సు చేసే అల్గోరిథమ్‌లపై ప్రభుత్వం వివరణ కోరింది.
డీప్‌ఫేక్‌లు, బాట్ అకౌంట్లపై చర్యలు తీసుకుంటామని మెటా హామీ
మూడో విడత సమావేశంలో మెటా తమ ప్లాట్‌ఫామ్‌లు ఎలా పనిచేస్తాయో ప్రభుత్వానికి వివరించింది. డీప్‌ఫేక్ వీడియోలు, CSAM కంటెంట్, బాట్ అకౌంట్లు, గుర్తింపు లేకుండా రూపొందించిన సింథటిక్ కంటెంట్‌ను గుర్తించి నియంత్రించే సాంకేతిక పరిష్కారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. వీటిని మరింత సమర్థంగా అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ప్రభుత్వం లేవనెత్తిన అంశాలు చాలా తీవ్రమైనవని మెటా అంగీకరించినట్లు సమాచారం.
ఇతర సోషల్ మీడియా సంస్థలకు కూడా నోటీసులు వచ్చే అవకాశం
మెటాపై మాత్రమే కాకుండా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. భారత చట్టాల ప్రకారం అవి నిజంగా 'ఇంటర్మీడియరీ'లుగా మాత్రమే పనిచేస్తున్నాయా లేదా కంటెంట్‌పై ప్రత్యక్ష నియంత్రణ చూపుతున్నాయా అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒకవేళ ఏదైనా సంస్థ వినియోగదారులకు ఏ కంటెంట్ చూపించాలనే విషయంలో ప్రత్యక్షంగా నిర్ణయాలు తీసుకుంటే, దానిని కేవలం మధ్యవర్తిగా కాకుండా ప్రచురణ సంస్థగా కూడా పరిగణించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ ప్లాట్‌ఫామ్‌లపై పబ్లిష్ అయ్యే కంటెంట్‌కు ఆయా సంస్థలే బాధ్యత వహించాల్సి రావచ్చు.
ప్రధాని పోస్టు తొలగింపుతో..
ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ పోస్టు తాత్కాలికంగా తొలగించిన ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం మెటాను వివరణ కోరింది. ఈ ఘటనపై మెటా క్షమాపణలు తెలిపింది. అలాగే చిన్నారులపై లైంగిక దుర్వినియోగ కంటెంట్, డీప్‌ఫేక్‌లు, డబ్బు తీసుకుని కొన్ని కంటెంట్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాల్లో లోపాలు ఉన్నాయని కూడా అంగీకరించింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు నిరంతర చర్యలు తీసుకుంటామని మెటా ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. మరోవైపు మెటా తీసుకునే చర్యలను కేంద్ర ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తూ, అవసరమైతే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.




