ఇదెక్కడి వింత రా సామీ.. మనుషుల కోసం భారీ ఫ్రిజ్.. ఎందుకో తెలిస్తే అవాక్కే..!
Japan Human Fridge: ఈ 'హ్యూమన్ ఫ్రిజ్' లోపలి భాగంలో ఉష్ణోగ్రత ఎప్పుడూ 15 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరంగా ఉంటుంది. వ్యక్తి లోపలకు వెళ్లి సీటుపై కూర్చోగానే అతనికి తల, మెడ, భుజాల భాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఏకంగా 5 డిగ్రీల సెల్సియస్ చల్లటి గాలి వేగంగా తాకుతుంది.
ఇదెక్కడి వింత రా సామీ.. మనుషుల కోసం భారీ ఫ్రిజ్.. ఎందుకో తెలిస్తే అవాక్కే..!
Japan Human Fridge: బాగా వేడిగా ఉన్నప్పుడు చల్లటి ఫ్రిజ్‌లో దాక్కుంటే ఎంత బాగుంటుందో అని ఎప్పుడైనా అనుకున్నారా? జపాన్‌కు చెందిన ఒక ప్రముఖ సంస్థ ఆ ఊహను నిజం చేస్తూ 'మనిషి పట్టే ఫ్రిజ్'ను తయారు చేసింది. 'దో హీమోన్ బాక్స్' పేరుతో రూపుదిద్దుకున్న ఈ పరికరం తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తూ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. వేసవిలో వడదెబ్బ, తీవ్రమైన అలసట కారణంగా ఆసుపత్రుల పాలయ్యేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ తీవ్రమైన ఉష్ణమండల పరిస్థితులను తట్టుకోవడానికి జపాన్‌కు చెందిన ఇండస్ట్రియల్ పరికరాల సరఫరా సంస్థ ట్రస్కో నాకయామా, శీతలీకరణ నిపుణులు సాండెన్ రిటైల్ సిస్టమ్స్ కలిసి ఒక అద్భుత పరిష్కారాన్ని కనుగొన్నారు. సాధారణంగా పానీయాలు, ఆహార పదార్థాలను చల్లబరిచే వెండింగ్ మెషిన్ల సాంకేతికతను ఆధారం చేసుకుని 'దో హీమోన్ బాక్స్' పేరుతో ఒక పోర్టబుల్ కూలింగ్ క్యాబిన్‌ను రూపొందించారు. బయట నుంచి చూసేందుకు ఇది ఒక పెద్ద ఫ్రిజ్‌లా కనిపిస్తుంది. ఒక మనిషి లోపలికి వెళ్లి కూర్చునేందుకు వీలుగా దీనిని నిర్మించారు.
ఐదు నిమిషాల్లోనే శరీరం జిల్.. పనిచేసే విధానం ఇదిగో..
ఈ 'హ్యూమన్ ఫ్రిజ్' లోపలి భాగంలో ఉష్ణోగ్రత ఎప్పుడూ 15 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరంగా ఉంటుంది. వ్యక్తి లోపలకు వెళ్లి సీటుపై కూర్చోగానే అతనికి తల, మెడ, భుజాల భాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఏకంగా 5 డిగ్రీల సెల్సియస్ చల్లటి గాలి వేగంగా తాకుతుంది. శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఈ శరీర భాగాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. దాంతో కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లోనే వడదెబ్బ లక్షణాలు మాయమై శరీరం సాధారణ స్థితికి చేరుకుంటుంది. గంటల తరబడి ఎండలో పనిచేసి వచ్చినవారికి ఇది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. అతిగా చల్లబడకుండా ఉండేందుకు 20 నిమిషాల తర్వాత ఈ పరికరం దానంతట అదే ఆగిపోయేలా ఆటోమేటిక్ సేఫ్టీ టైమర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
చక్రాలు, తక్కువ విద్యుత్ సేవలు..
బహిరంగ ప్రదేశాలు, నిర్మాణాలు జరిగే స్థలాలు, ఫ్యాక్టరీలు, ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో దీనిని సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రత్యేకమైన ఇన్స్టాలేషన్ పనులు ఏవీ లేకుండానే సాధారణ విద్యుత్ సాకెట్‌తో ఇది పనిచేస్తుంది. కింద చక్రాలు ఉండటం వల్ల ఒక చోటు నుంచి మరో చోటుకు సులభంగా తరలించవచ్చు. సాధారణ పారిశ్రామిక కూలర్లతో పోలిస్తే ఇది సగం విద్యుత్‌ను మాత్రమే వినియోగించుకుంటుంది. కరెంట్ లేని ప్రాంతాల్లో సైతం వాడుకోవడానికి అనువుగా పోర్టబుల్ పవర్ స్టేషన్ సదుపాయం కూడా ఉంది.
నెట్టింట వైరల్.. మిశ్రమ స్పందన..
సామాజిక మాధ్యమాల్లో ఈ హ్యూమన్ ఫ్రిజ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో కష్టపడే శ్రామికులకు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది ఒక గొప్ప వరమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరోవైపు మనుషులను కూడా ఫ్రిజ్‌లో పెట్టే రోజులు వచ్చాయా అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న భానుడి ప్రతాపానికి చెక్ పెట్టేందుకు ఇటువంటి సాంకేతికతలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వాతావరణ మార్పుల వల్ల ఏర్పడుతున్న తీవ్రమైన ఎండలను ఎదుర్కొనేందుకు సాంకేతికత ఏ స్థాయిలో పురోగమిస్తుందో ఈ వింత ఫ్రిజ్ నిరూపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇతర దేశాల్లోనూ ఇటువంటి వినూత్న శీతలీకరణ సాధనాలు మరింతగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.




