చందమామ కేక్ రహస్యం.. నాసాను ఆశ్చర్యపరిచిన ఇస్రో సరికొత్త ఆవిష్కరణ!

Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ ముగిసినా ఇస్రో సృష్టిస్తున్న సంచలనాలు ఆగడం లేదు. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని ‘శివశక్తి పాయింట్’ వద్ద విక్రమ్ ల్యాండర్ చేసిన ‘హాప్ ఎక్స్‌పెరిమెంట్’ (పైకి లేచి దిగడం) ద్వారా నాసా సైతం అబ్బురపడే సరికొత్త రహస్యం వెలుగుచూసింది.

KKV Sudhakar, Sullurupeta
Published on: 26 May 2026 12:54 PM IST
Chandrayaan-3
X

చందమామ కేక్ రహస్యం.. నాసాను ఆశ్చర్యపరిచిన ఇస్రో సరికొత్త ఆవిష్కరణ!

Chandrayaan-3: భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ అధికారికంగా ముగిసినప్పటికీ, అది సృష్టించిన అద్భుతాలు మాత్రం ఇప్పటికీ అంతర్జాతీయ అంతరిక్ష రంగాన్ని అబ్బురపరుస్తూనే ఉన్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని ‘శివశక్తి పాయింట్’ వద్ద విక్రమ్ ల్యాండర్ చేసిన ఒక చిన్న ప్రయోగం ఇప్పుడు శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తగా, అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ సైతం షాకయ్యే సరికొత్త విషయాలను ఇస్రో వెలుగులోకి తెచ్చింది. నిజానికి విక్రమ్ ల్యాండర్ తన నిర్దేశిత ప్రయోగాలు పూర్తి చేసుకునే సమయానికి దానిలో కొంత ఇంధనం మిగిలి ఉండటంతో, ఇస్రో శాస్త్రవేత్తలు ముందుగా ప్లాన్ చేయని ఒక అద్భుతమైన సాహసానికి శ్రీకారం చుట్టారు.

ల్యాండర్ ఇంజిన్లను మళ్లీ మండించి, దానిని చంద్రుడి ఉపరితలం నుంచి 50 సెంటీమీటర్ల పైకి లేపి, పక్కకు కాస్త దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేశారు. సాంకేతికంగా ఇది భారత్‌కు ఒక మైలురాయి కాగా, శాస్త్రీయంగా అంతకంటే పెద్ద రహస్యం దీనివల్ల బయటపడింది. ల్యాండర్ ఇంజిన్లు మళ్లీ మండటంతో ఆ మంటల ధాటికి చంద్రుడిపై ఉన్న 3 సెంటీమీటర్ల పైపొర గాల్లోకి లేచింది. పైన ఉండే మెత్తటి, దూదిలాంటి పొడి మట్టి కొట్టుకుపోవడంతో, దాని కింద ఎప్పుడూ సూర్యరశ్మి తగలని సరికొత్త మట్టి పొరలు బయటపడ్డాయి. దీనివల్ల ఎలాంటి డ్రిల్లింగ్ మిషన్ సహాయం లేకుండానే చంద్రుడి అంతర్భాగంలో ఉన్న మట్టిని పరిశీలించే అరుదైన అవకాశం ల్యాండర్‌లోని ‘చాస్టే’ (ChaSTE) పరికరానికి దక్కింది.

​ఈ ప్రయోగం ద్వారా వచ్చిన డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు చంద్రుడి ఉపరితలం ‘కేక్’లా పొరలు పొరలుగా ఉందని తేల్చారు. పైన ఉండే మట్టి ఎంతో వదులుగా, పొడి పిండిలా ఉంటే, కేవలం 6 సెంటీమీటర్ల లోతులోనే అది తడి జిగురు మట్టిలా చాలా గట్టిగా మారిపోతోందని, అంటే అత్యంత తక్కువ దూరంలోనే నేల స్వభావం పూర్తిగా మారిపోతోందని స్పష్టమైంది. ఈ రకమైన వైవిధ్యం గతంలో అమెరికా అపోలో మిషన్లు వెళ్లిన చంద్రుడి భూమధ్యరేఖ ప్రాంతంలో ఎక్కడా కనిపించలేదు. ఇస్రో కనిపెట్టిన ఈ సరికొత్త విషయం నాసాకు ఎంతో కీలకంగా మారబోతోంది.

నాసా తన ప్రతిష్ఠాత్మక ‘ఆర్టెమిస్’ మిషన్ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై మనుషులను దించి, అక్కడ శాశ్వత మానవ స్థావరాలను నిర్మించాలని భావిస్తోంది. భవిష్యత్తులో అక్కడ ఇళ్లు కట్టాలన్నా, వ్యోమనౌకలు దిగాలన్నా ఈ పొరల స్వభావం తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అంతేకాకుండా, ఈ గట్టి పొరలే చంద్రుడి లోపల ఉన్న మంచు గడ్డకట్టేలా కాపాడుతున్నాయని తెలియడంతో, రాబోయే అంతర్జాతీయ చంద్రమండల మిషన్లకు భారత్ అందించిన ఈ డేటా ఒక గైడ్‌లా మారబోతోంది.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story