Infinix GT 50 Pro: గేమింగ్ ప్రియులకు పండగే.. ఇన్ఫినిక్స్ నుంచి అదిరిపోయే ఫోన్..!
Infinix GT 50 Pro: గేమిండ్ ప్రియుల కోసం ఇన్ఫినిక్స్ సంస్థ ఓ పవర్ ఫుల్ ఫోన్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో ఫీచర్లు చూస్తే కచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే.
Infinix GT 50 Pro: గేమింగ్ ప్రియులకు పండగే.. ఇన్ఫినిక్స్ నుంచి అదిరిపోయే ఫోన్..!
Infinix GT 50 Pro: స్మార్ట్‌ఫోన్ రంగంలో తనదైన ముద్ర వేస్తున్న ఇన్ఫినిక్స్ సంస్థ, గేమింగ్ ప్రియుల కోసం సరికొత్త జీటీ 50 ప్రోను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. అత్యాధునిక రూపకల్పన, శక్తివంతమైన కూలింగ్ వ్యవస్థతోపాటు మెరుగైన పనితీరుతో ఈ ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. దీనికి సంబంధించిన కీలక వివరాలు, ఆకర్షణీయమైన ఫీచర్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అదిరిపోయే డిజైన్..
తాజా నివేదికల ప్రకారం, ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రో గత మోడళ్ల కంటే మరింత ఆకర్షణీయంగా ఉండబోతోంది. ఇది వేగవంతమైన స్పోర్ట్స్ కార్స్ (Hypercars) నుంచి స్ఫూర్తి పొందిన రూపకల్పనతో వస్తోంది. ఫోన్ వెనుక భాగంలో కెవ్లర్ వంటి ఆకృతిని, పారదర్శకమైన రంగుల విండోను అమర్చారు. ఇది ఫోన్ లోపల ఉండే కూలింగ్ వ్యవస్థను బయటకు చూపిస్తూ, ఫోన్ ఊపిరి పీల్చుకుంటున్నట్లుగా డైనమిక్ లుక్‌ను ఇస్తుంది.
అద్భుతమైన గేమింగ్ కంట్రోల్స్..
గేమర్ల సౌకర్యం కోసం ఈ ఫోన్లో ప్రత్యేకమైన షోల్డర్ ట్రిగ్గర్స్ (బటన్లు) ఇస్తున్నారు. ఇవి కేవలం నొక్కడానికే కాకుండా, వేలితో జరపడానికి (Sliding) కూడా సహకరిస్తాయి. దాదాపు 30 లక్షల సార్లు నొక్కినా పాడవని విధంగా వీటిని రూపొందించారు. కేవలం 20 మిల్లీ సెకన్ల వ్యవధిలో ఇవి స్పందిస్తాయి. గేమింగ్‌తో పాటు కెమెరా జూమ్ చేయడం లేదా ఇతర షార్ట్కట్ల కోసం కూడా వీటిని వాడుకోవచ్చు.
వేడిని తగ్గించే అత్యాధునిక కూలింగ్ వ్యవస్థ..
ఎంత ఎక్కువ సేపు గేములు ఆడినా ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో మైక్రో-పంప్ లిక్విడ్ కూలింగ్ వ్యవస్థను వాడుతున్నారు. ఇది 6,437 చదరపు మిల్లీమీటర్ల భారీ విస్తీర్ణంలో వ్యాపించి ఉండి, ఫోన్ లోపల వేడిని త్వరగా బయటకు పంపుతుంది. దీనివల్ల భారీ గేములు ఆడుతున్నప్పుడు కూడా ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా స్థిరమైన పనితీరును అందిస్తుంది.
ఇతర అద్భుతమైన ఫీచర్లు..
డిస్ప్లే: 6.78 అంగుళాల అమోలెడ్ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన విజువల్స్ ఇస్తుంది.
ప్రాసెసర్: అత్యంత వేగవంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ చిప్‌సెట్‌ను ఇందులో వాడుతున్నారు.
కెమెరా: వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. ముందు వైపు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
ఛార్జింగ్: ఇందులో మాగ్ ఛార్జ్ 2.0 అనే సరికొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నారు. ఇది వైర్లెస్ ఛార్జింగ్ ఇస్తూనే ఫోన్ వేడెక్కకుండా చూస్తుంది.
భారతీయ ధృవీకరణ సంస్థ (BIS) జాబితాలో ఈ ఫోన్ ఇప్పటికే కనిపించినందున, అతి త్వరలోనే ఇది మన దేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది.




