HP AI Printing : ఒక్క క్లిక్‌తో అనవసర కంటెంట్ మాయం.. HP కొత్త AI మ్యాజిక్.!

HP AI printing : ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం హెచ్‌పీ (HP) తన ఎంపిక చేసిన ఇంక్జెట్ ప్రింటర్ల కోసం సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్‌ను పరిచయం..

G Krishna
Published on: 31 May 2026 3:40 PM IST
HP AI Printing : ఒక్క క్లిక్‌తో అనవసర కంటెంట్ మాయం.. HP కొత్త AI మ్యాజిక్.!
X

HP AI printing : ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం హెచ్‌పీ (HP) తన ఎంపిక చేసిన ఇంక్జెట్ ప్రింటర్ల కోసం సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్‌ను పరిచయం చేసింది. ‘ఏఐ ఆప్టిమైజ్డ్ ప్రింట్ ఫార్మాటింగ్’ (AI Optimized Print Formatting) పేరుతో వచ్చిన ఈ సరికొత్త సాంకేతికత ప్రింటింగ్ ప్రక్రియను మునుపటి కంటే మరింత స్మార్ట్‌గా, సులభంగా, మరింత ఉపయోగకరంగా మారుస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ సరికొత్త ఫీచర్ వెబ్‌పేజీలు, డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లను స్వయంచాలకంగా విశ్లేషించి కేవలం అవసరమైన సమాచారాన్ని మాత్రమే ప్రింట్ చేస్తుంది. దీనివల్ల స్పష్టమైన ప్రింట్ అవుట్ రావడమే కాకుండా కాగితం, ప్రింటర్ ఇంక్ రెండూ భారీగా ఆదా అవుతాయి.

ఏఐ ఆప్టిమైజ్డ్ ప్రింట్ ఫార్మాటింగ్ అంటే ఏమిటి?

సాధారణంగా మనం ఏదైనా ఒక వెబ్‌పేజీని , ఆన్‌లైన్ ఆర్టికల్‌ను ప్రింట్ చేసేటప్పుడు.. దాంతో పాటు అనవసరమైన ప్రకటనలు (Ads), బ్యానర్లు, న్యూస్ రీల్స్ వంటివి కూడా ప్రింట్ అయిపోతుంటాయి. దీనివల్ల అవసరం లేకపోయినా ఎక్కువ పేజీలు రావడం, ఇంక్ వృధా అవ్వడం వంటి సమస్యలు ఎదురవుతాయి. హెచ్‌పీ ప్రవేశపెట్టిన ఈ సరికొత్త ఏఐ సాంకేతికత వెబ్‌పేజీలోని కంటెంట్‌ను పూర్తిగా స్క్యాన్ చేసి, అందులో యూజర్‌కు అవసరమైన ముఖ్యమైన భాగాన్ని మాత్రమే గుర్తిస్తుంది. ఆపై అనవసరమైన ప్రకటనలను తొలగించి, ఫార్మాటింగ్‌ను స్వయంచాలకంగా సరిచేసి, స్పష్టమైన , క్రమబద్ధమైన ప్రింట్ అవుట్‌ను సిద్ధం చేస్తుంది.

కాగితం, ఇంక్ ఆదాపై ప్రత్యేక దృష్టి

ఈ ఏఐ ఫీచర్ కేవలం మంచి ప్రింటింగ్ అనుభవాన్ని ఇవ్వడమే కాకుండా, వనరుల పొదుపుపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. రోజువారీ జీవితంలో ఆఫీస్ డాక్యుమెంట్లు, వంటల రెసిపీలు, పిల్లల వర్క్‌షీట్లు , స్టడీ మెటీరియల్స్ ప్రింట్ తీసుకునే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఏఐ సహాయంతో అదనపు కంటెంట్ అంతా తొలగిపోవడం వల్ల ప్రింట్ అయ్యే పేజీల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. తద్వారా ఇంక్ వినియోగం కూడా తగ్గుముఖం పడుతుంది. ఈ సాంకేతికత వల్ల వినియోగదారులకు ప్రింటింగ్ ఖర్చులు తగ్గడమే కాకుండా, కాగితం వాడకం తగ్గి పర్యావరణంపై కూడా సానుకూల ప్రభావం పడుతుందని హెచ్‌పీ విశ్వసిస్తోంది. ముఖ్యంగా ఇళ్లు, చిన్న తరహా కార్యాలయాలకు (Small Offices) ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా మారుతుంది.

యూజర్ అలవాట్లను నేర్చుకునే స్మార్ట్ సిస్టమ్

హెచ్‌పీ ఇండియా ప్రింట్ సెగ్మెంట్ సీనియర్ డైరెక్టర్ సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏఐ సాంకేతికత కాలక్రమేణా వినియోగదారుల ప్రింటింగ్ అలవాట్లను, వారి అవసరాలను స్వయంగా అర్థం చేసుకుంటుంది. ప్రారంభంలో ఈ సిస్టమ్ యూజర్ ఎలాంటి కంటెంట్‌ను ఎక్కువగా ప్రింట్ చేస్తున్నారనే దానిపై కొన్ని ప్రాథమిక ప్రశ్నల ద్వారా ఒక అవగాహనకు వస్తుంది. ఆ తర్వాత వారి ప్రింటింగ్ ప్యాటర్న్ ఆధారంగా మరింత ఖచ్చితమైన అవుట్‌పుట్‌ను ఇస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తరచూ ఆన్‌లైన్ ఆర్టికల్స్, రెసిపీలను ప్రింట్ చేస్తుంటే, సిస్టమ్ తదుపరిసారి కేవలం ఆ కంటెంట్‌కే ప్రాధాన్యత ఇస్తుంది. దీనివల్ల ప్రతిసారీ మాన్యువల్‌గా ఎడిటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, తక్కువ సమయంలోనే స్మార్ట్‌గా ప్రింటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story