Hisense A10 Pro : ఈ ఫోన్ స్క్రీన్ వెనక్కి తీసేయొచ్చు.. హైసెన్స్ A10 సిరీస్ లాంచ్

Hisense A10 Pro : స్మార్ట్‌ఫోన్ రంగాన్ని సరికొత్త బాట పట్టించేలా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హైసెన్స్ (Hisense) ఒక అద్భుతమైన కాన్సెప్ట్‌ను ప్రపంచానికి పరిచయం

G Krishna
Published on: 29 Aug 2026 5:18 PM IST
hisense A10 pro
X

hisense A10 pro

Hisense A10 Pro : స్మార్ట్‌ఫోన్ రంగాన్ని సరికొత్త బాట పట్టించేలా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హైసెన్స్ (Hisense) ఒక అద్భుతమైన కాన్సెప్ట్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. చైనా మార్కెట్‌లో ‘Hisense A10 Pro’ , ‘Hisense A10 Ultra’ పేర్లతో రెండు ప్రత్యేకమైన ఈ-ఇంక్ (E-Ink) స్మార్ట్‌ఫోన్లను సంస్థ అధికారికంగా విడుదల చేసింది. సాధారణ డిజిటల్ స్క్రీన్ల వల్ల కళ్లకు కలిగే శ్రమను తగ్గించేలా పేపర్‌లాంటి రీడింగ్ అనుభూతిని అందించడంతో పాటు, అవసరమైనప్పుడు రంగుల ప్రపంచాన్ని ఆస్వాదించడానికి ప్రత్యేకమైన డిటాచబుల్ కలర్ స్క్రీన్‌ను అమర్చుకునే వినూత్న సాంకేతికతను ఈ సిరీస్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు.

కళ్లకు హాయినిచ్చే ఈ-ఇంక్ డిస్‌ప్లే సాంకేతికత

హైసెన్స్ A10 సిరీస్‌లో 6.13 అంగుళాల Carta 1300 e-ink డిస్‌ప్లేను అమర్చారు. ఇది 1648×824 పిక్సెల్స్ రిజల్యూషన్ , 300 ppi పిక్సెల్ డెన్సిటీతో స్పష్టమైన విజువల్స్ ఇస్తుంది. 256 గ్రేస్కేల్ లెవల్స్, 36 డ్యూయల్-కలర్ ఫ్రంట్ లైటింగ్ సపోర్ట్‌తో వచ్చే ఈ స్క్రీన్ సాధారణ స్మార్ట్‌ఫోన్లలా కాకుండా సరిగ్గా పుస్తకం చదువుతున్న అనుభూతినే అందిస్తుంది. ఇందులో బ్లూ లైట్, స్క్రీన్ ఫ్లికర్ వంటి సమస్యలు ఏమాత్రం ఉండవు. దాంతో నిరంతరం ఈ-బుక్స్ చదివేవారు, పిడిఎఫ్ ఫైళ్లు పరిశీలించే విద్యార్థులు, డిజిటల్ నోట్స్ రాసుకునే వారికి ఇది ఒక అద్భుతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. దీని డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇందులో ప్రత్యేకంగా E Ink T2000 హార్డ్‌వేర్ TCON చిప్‌ను సైతం వాడారు.

అవసరమైనప్పుడు జోడించుకునే డిటాచబుల్ కలర్ స్క్రీన్

ఈ A10 సిరీస్‌లోనే అత్యంత ఆకర్షణీయమైన అంశం దాని డిటాచబుల్ కలర్ స్క్రీన్ కాన్సెప్ట్. ఫోన్ వెనుక భాగంలో ఉండే మాగ్నెటిక్ రింగ్, మెటల్ కాంటాక్ట్స్ ఆధారంగా 4.96 అంగుళాల ఎల్‌సీడీ కలర్ డిస్‌ప్లేను సులభంగా అమర్చుకోవచ్చు లేదా తొలగించుకోవచ్చు. ఈ కలర్ స్క్రీన్‌ను అమర్చిన వెంటనే ఇది ఒక సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా మారిపోతుంది. దీని సహాయంతో కలర్ కామిక్స్ చదవడం, వర్ణరంజిత ఫొటోలు, వీడియోలు చూడటం , సోషల్ మీడియా యాప్స్‌ను హాయిగా వినియోగించుకోవచ్చు. అత్యుత్తమ మోడల్ అయిన A10 Ultra బాక్స్‌లోనే ఈ కలర్ స్క్రీన్ లభిస్తుండగా, A10 Pro మోడల్‌లో మాగ్నెటిక్ సపోర్ట్ ఉన్నప్పటికీ కలర్ స్క్రీన్‌ను వినియోగదారులు విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

శక్తివంతమైన ప్రాసెసర్ , సుదీర్ఘ బ్యాటరీ లైఫ్

ఈ రెండు ఫోన్లలోనూ 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేసే 4nm ఆధారిత Qualcomm QCM6690 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ-ఇంక్ డిస్‌ప్లే స్వభావాన్ని బట్టి బ్యాటరీ వినియోగాన్ని ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకునేలా దీని పవర్ మేనేజ్‌మెంట్‌ను డిజైన్ చేశారు. చదివే సమయంలో పవర్ వినియోగాన్ని తగ్గించి, ఎక్కువ పనిభారం ఉన్నప్పుడు మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ ఫోన్లలో 4000mAh బ్యాటరీ ఉంది. ఇది 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ , 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రత్యేకంగా A10 Ultra వెర్షన్‌లో మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా కల్పించారు.

ఆధునిక ఆండ్రాయిడ్ ఫీచర్లు , కెమెరా వివరాలు

ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం ఫోన్ వెనుక భాగంలో 48MP ప్రధాన కెమెరాను, సెల్ఫీలు , వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అందించారు. సాధారణంగా ఈ-ఇంక్ ఫోన్లలో ఉండే యాప్ పరిమితులను అధిగమిస్తూ ఈ సిరీస్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. యూజర్లు తమకు కావలసిన అన్ని సాధారణ ఆండ్రాయిడ్ యాప్‌లను ఇందులో నేరుగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీనికి తోడు ఎన్‌ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, వై-ఫై 6, కాల్ రికార్డింగ్, యాప్ క్లోనింగ్ వంటి మల్టీఫంక్షన్ ఫీచర్లను కూడా చేర్చారు.

ధరలు వివరాలు

మూన్ వైట్, బాంబో గ్రీన్ రంగుల్లో లభించే ఈ ఫోన్లు ప్రస్తుతం చైనా మార్కెట్‌లో మాత్రమే విడుదలై అందుబాటులోకి వచ్చాయి. భారత మార్కెట్‌లో వీటి లాంచ్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ధరల విషయానికి వస్తే, A10 Pro బేస్ వేరియంట్ (8GB+128GB) 2,799 యువాన్లు (సుమారు రూ. 39,700), 8GB+256GB వేరియంట్ 2,999 యువాన్లు (సుమారు రూ. 42,500), , టాప్ వేరియంట్ (12GB+512GB) 3,499 యువాన్లు (సుమారు రూ. 49,700) గా ఉంది. ఇక A10 Ultra మోడల్ 8GB+128GB వేరియంట్ 3,198 యువాన్లు (సుమారు రూ. 45,400), 8GB+256GB వేరియంట్ 3,398 యువాన్లు (సుమారు రూ. 48,000), అలాగే 12GB+512GB హై-ఎండ్ వేరియంట్ 3,898 యువాన్లు (సుమారు రూ. 55,300) గా అందుబాటులోకి వచ్చింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story