Google Gemini 3.5 Pro : సుందర్ పిచాయ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు షాక్.. జెమిని 3.5 ప్రో వాయిదా.!
Google Gemini 3.5 Pro : కృత్రిమ మేధస్సు (AI) రంగంలో అగ్రగామిగా నిలవాలని చూస్తున్న టెక్ దిగ్గజం గూగుల్‌కు భారీ నిరాశ ఎదురైంది.
Gemini 3.5 Pro
Google Gemini 3.5 Pro : కృత్రిమ మేధస్సు (AI) రంగంలో అగ్రగామిగా నిలవాలని చూస్తున్న టెక్ దిగ్గజం గూగుల్‌కు భారీ నిరాశ ఎదురైంది. కంపెనీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ 'జెమిని 3.5 ప్రో' (Gemini 3.5 Pro) విడుదల షెడ్యూల్ కంటే చాలా నెలలు ఆలస్యమవుతోంది. అంతర్గత లక్ష్యాలను, ముఖ్యంగా 'కోడింగ్' విభాగంలో ఈ మోడల్ ఆశించిన స్థాయి ప్రదర్శన కనబరచకపోవడమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ వార్త వెలువడిన వెంటనే గూగుల్ మాతృ సంస్థ 'ఆల్ఫాబెట్' షేర్లు గురువారం ట్రేడింగ్‌లో దాదాపు 3 నుంచి 4 శాతం వరకు పతనమయ్యాయి.
కోడింగ్‌లో వైఫల్యం.. పెరిగిపోతున్న పోటీ
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. మే నెలలో జరిగిన గూగుల్ Google I/O కాన్ఫరెన్స్‌లో సీఈఓ సుందర్ పిచాయ్ ఈ మోడల్‌ను ప్రకటిస్తూ, అప్పటికే దీనిని అంతర్గతంగా వాడుతున్నట్లు చెప్పారు. జూన్ నాటికల్లా దీనిని మార్కెట్లోకి తీసుకురావాలని భావించారు. అయితే, కోడింగ్ నైపుణ్యాలలో జెమిని 3.5 ప్రో ఘోరంగా విఫలమవడంతో ఇంజనీర్లు, పరిశోధకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత నెల చివర్లో డేటాను అప్‌డేట్ చేసి ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. మరోవైపు గూగుల్ పోటీదారులైన ఆంత్రోపిక్ (Anthropic) 'క్లాడ్ ఫేబుల్ 5' (Claude Fable 5)ను, ఓపెన్ఏఐ (OpenAI) 'జీపీటీ-5.6' (GPT-5.6) మోడళ్లను ఇప్పటికే మార్కెట్లోకి తెచ్చాయి. ఇవి ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయంటే, వీటి విడుదలను కాస్త నియంత్రించాలని యూఎస్ ప్రభుత్వం సదరు సంస్థలను కోరినట్లు సమాచారం.
సముద్రాన్ని మరిగించినట్టుంది.. గూగుల్ పెద్దతనమే శాపమా?
గూగుల్ లాంటి భారీ సంస్థలో ఉన్న మితిమీరిన నిబంధనలు, వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం కూడా ఈ ఆలస్యానికి కారణమని ఉద్యోగులు చెబుతున్నారు. సెర్చ్, మ్యాప్స్, యూట్యూబ్, ఆండ్రాయిడ్, క్లౌడ్ వంటి ప్రతి విభాగంలోనూ ఏఐని జోడించే క్రమంలో లేయర్స్ మేనేజ్‌మెంట్ ఎక్కువైపోయింది. అందరినీ ఒకే దిశగా నడిపించడం అనేది "సముద్రాన్ని మరిగించడం" (Boil an ocean) లాంటి కష్టమైన పనిగా మారిందని ఒక మాజీ ఉద్యోగి వ్యాఖ్యానించారు. అలాగే, ఒకే రకమైన పనిని వేర్వేరు బృందాలు చేయడం, కంప్యూటింగ్ పవర్ కోసం అంతర్గత పోటీ ఉండటం వల్ల స్పష్టమైన వ్యూహం లేకుండా పోయింది. ఈ గందరగోళం నచ్చక చాలా మంది కీలక నిపుణులు గూగుల్‌ను వీడి ఆంత్రోపిక్ వంటి ఇతర ల్యాబ్స్‌లో చేరుతున్నారు.
డేటా లీక్ భయాలు.. అంతర్గత ఆంక్షలు
ప్రారంభంలో గూగుల్ ఉద్యోగులు సాఫ్ట్‌వేర్ రాయడానికి లేదా విశ్లేషించడానికి జెమిని మోడల్‌ను ఉపయోగించడంపై ఆంక్షలు ఉండేవి. కంపెనీకి చెందిన రహస్య కోడ్ కాస్త ఏఐ ట్రైనింగ్ డేటాలోకి లీక్ అవుతుందనే భయమే దీనికి కారణం. ఆ తర్వాత నిబంధనలు సడలించినప్పటికీ, ప్రారంభ పరిశోధనలకు ఇది గండికొట్టింది. ప్రస్తుతం గూగుల్‌లో 75 శాతం కోడింగ్ ఏఐ ద్వారానే జనరేట్ అవుతోందని, అయితే కంప్యూటింగ్ పవర్ కొరత వల్ల ఇంజనీర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. పరిస్థితి తీవ్రతను గమనించిన గూగుల్ కో-ఫౌండర్ సెర్గీ బ్రిన్ స్వయంగా రంగంలోకి దిగి ఏఐ కోడింగ్‌ను వేగవంతం చేయాలని ఒత్తిడి తెస్తున్నారు.
గూగుల్ స్పందన ఏంటి.?
ఈ విమర్శలపై గూగుల్ ప్రతినిధి బ్లూమ్‌బెర్గ్ సంస్థతో మాట్లాడుతూ.. తాము వినియోగదారులకు తక్కువ ఖర్చుతో కూడిన వివిధ రకాల ఏఐ మోడళ్లను వేగంగా అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జెమిని 3.5 ప్రో తో పాటు అప్‌గ్రేడెడ్ ఫ్లాష్ మోడల్‌ను భాగస్వాములతో కలిసి టెస్ట్ చేస్తున్నామని, భద్రతకు సంబంధించి యూఎస్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. గూగుల్ పూర్తిగా వెనుకబడిపోలేదని, గూగుల్ సెర్చ్ డేటాను విశ్లేషించడంలో జెమిని ఇప్పటికీ అత్యంత శక్తివంతమైనదని పరిశోధకులు అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ, జనరల్ ఏఐ మోడళ్ల రేసులో ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ కంటే గూగుల్ వెనుకబడిందనేది స్పష్టమవుతోంది.




