Gmail: జీమెయిల్ యూజర్‌నేమ్‌ను ఈజీగా మార్చుకోండి.. 20 ఏళ్ల నాటి రూల్ ఎత్తేసిన గూగుల్..

Gmail Username Change: గూగుల్ తన జీమెయిల్ సేవలలో చారిత్రాత్మక మార్పును చేపట్టింది. గత రెండు దశాబ్దాలుగా ఉన్న కఠినమైన నిబంధనను సడలిస్తూ, వినియోగదారులు తమ పాత ఈమెయిల్ అడ్రస్‌ను మార్చుకునే వెసులుబాటును కల్పించింది.

Venkat
Published on: 1 April 2026 12:41 PM IST
Gmail
X

Gmail: జీమెయిల్ యూజర్‌నేమ్‌ను ఈజీగా మార్చుకోండి.. 20 ఏళ్ల నాటి రూల్ ఎత్తేసిన గూగుల్..

Gmail Username Change: గూగుల్ త్వరలో ఒక సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా వినియోగదారులు తమ ప్రాథమిక జీమెయిల్ ఐడీని మార్చుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం, ఒకసారి సృష్టించిన ఈమెయిల్ చిరునామాను మార్చడం అసాధ్యం. కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా గూగుల్ ఈ పాత నియమాన్ని రద్దు చేస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సుందర్ పిచాయ్ సామాజిక మాధ్యమాల వేదికగా ధృవీకరించారు. 2004లో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పటికీ అదే పాత ఐడీలతో కొనసాగాల్సిన అవసరం లేదని ఆయన చమత్కరించారు.

డేటా భద్రత..

ఈ కొత్త ఫీచర్ ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, కొత్త ఖాతాను సృష్టించాల్సిన అవసరం లేకుండానే యూజర్‌నేమ్‌ను మార్చుకోవచ్చు. చాలా మంది గతంలో సరదాగా లేదా ఓ ఐడియా లేకుండా క్రియోట్ చేసుకున్న ఈమెయిల్ పేర్లను ఇప్పుడు వృత్తిపరమైన అవసరాల కోసం మార్చుకోవాలని భావిస్తుంటారు. ఈ అప్‌డేట్ వల్ల మీ పాత ఈమెయిళ్ళు, గూగుల్ డ్రైవ్ ఫైళ్లు, గూగుల్ ఫోటోలు అన్నీ భద్రంగా ఉంటాయి. డేటా బదిలీ చేయాల్సిన శ్రమ తప్పుతుంది.

పాత ఈమెయిల్ ఐడి పరిస్థితి ఏమిటి?

మీరు కొత్త ఐడిని ఎంచుకున్నప్పటికీ, మీ పాత ఈమెయిల్ చిరునామా పూర్తిగా రద్దు కాదు. అది మీ ఖాతాకు అనుబంధ చిరునామాగా కొనసాగుతుంది. ఎవరైనా మీ పాత అడ్రస్‌కు మెయిల్ పంపినా, అది మీకు అందుతుంది. పాత ఐడిని ఉపయోగించి కూడా మీరు లాగిన్ అవ్వవచ్చు. అయితే, ఒకసారి మార్చిన తర్వాత పాత ఐడీని మరో 12 నెలల వరకు వేరే కొత్త ఖాతా కోసం ఉపయోగించడానికి వీలుండదు.

మార్చుకునే విధానం..

ఈ ఫీచర్ దశలవారీగా వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. అర్హత పొందిన వారు తమ గూగుల్ ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ఈమెయిల్ విభాగం ద్వారా మార్పులు చేసుకోవచ్చు. అయితే, ఈ ప్రక్రియలో గూగుల్ సైన్-ఇన్ లేదా క్రోమ్ సింక్ వంటి సేవలలో చిన్నపాటి అంతరాయాలు కలిగే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. మార్పులు చేసే ముందు ముఖ్యమైన సమాచారాన్ని భద్రపరుచుకోవడం (బ్యాకప్) మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ మార్పు ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో ఉన్న యువతకు, తమ డిజిటల్ గుర్తింపును మార్చుకోవాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story